బుల్లెట్‌ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్‌

ముంబయి- అహ్మదాబాద్‌ మార్గంలో బులెట్ రైలు పరిగెత్తించేందుకు వేగంగా పనులు జరుగుతున్నాయి. 508 కిలోమీటర్ల మధ్య ట్రాక్‌ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. బుల్లెట్‌ రైలు కోసం ప్రత్యేక రకం ట్రాక్‌ను రైల్వేశాఖ నిర్మిస్తున్నది. తొలిసారిగా ట్రాక్‌కు సంబంధించిన వీడియోను కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్‌ ఎక్స్‌ హ్యాండిల్‌ ద్వారా విడుదల చేశారు.

దేశంలోనే తొలి బ్యాలస్ట్‌లెస్ ట్రాక్ విశేషాలను వివరించారు. గుజరాత్- ముంబై మధ్య నిర్మిస్తున్న ట్రాక్‌ గురించి సవివరంగా సమాచారం అందించారు. దాంతో పాటు బుల్లెట్ రైలు దృశ్యాలను యానిమేషన్ రూపంలో పొందుపరిచారు. ‘మేక్ ఇన్ ఇండియా’ కింద నిర్మిస్తున్న ఈ ట్రాక్‌లు బ్యాలస్ట్‌లెస్‌గా ఉన్నాయని, కంకర, కాంక్రీట్ కోణాలు అవసరం లేని ట్రాక్‌లు ఉన్నాయని అశ్విని వైష్ణవ్ చెప్పారు. 

హై-స్పీడ్ రైళ్ల బరువును భరించేందుకు ప్రత్యేకంగా ట్రాక్‌ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ట్రాక్‌లో వేగం గంటకు 320 కిమీ వరకు ఉంటుందని వైష్ణవ్ చెప్పారు. 153 కిలోమీటర్ల మేర వయాడక్ట్ పనులు పూర్తయ్యాయని.. దీంతోపాటు 295.5 కిలోమీటర్ల పీర్ వర్క్ కూడా పూర్తయ్యిందని వివరించారు. స్పెషల్‌ జేస్లాబ్‌ బాలస్ట్‌లెస్‌ ట్రాక్‌ సిస్టమ్‌ ఉపయోగిస్తున్నట్లు పేర్కొన్నారు. 

ఈ ట్రాక్ సిస్టమ్ ప్రధానంగా నాలుగు భాగాలుంటాయి. ఆర్‌సీ ట్రాక్‌ బెడ్‌ కాంక్రీట్‌ ఆస్ఫహాల్ట్ మోర్టార్‌ లేయర్‌, ఫాస్టెనర్‌లతో ప్రీ-కాస్ట్ స్లాబ్‌, పట్టాలతో కలిసి ట్రాక్‌ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. దేశంలోని రెండు చోట్ల ప్రీ-కాస్ట్ ఆర్‌సీ ట్రాక్ స్లాబ్‌లను తయారు చేస్తున్నట్లు వీడియోలో తెలిపారు. గుజరాత్‌లోని ఆనంద్, కిమ్‌లో తయారవుతున్నాయని.. సుమారు 35వేల మెట్రిక్ టన్నుల పట్టాలు అందుబాటులోకి వచ్చాయని.. నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు వీడియోలో రైల్వేశాఖ వివరించింది.