దిలీప్ ఘోష్, సుప్రియ వాఖ్యలపై ఈసీ నోటీసులు

 
పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, బీజేపీ లోక్‌సభ అభ్యర్థి కంగనా రనౌత్‌లపై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల సంఘం సీరియస్‌ అయ్యింది. బీజేపీ ఎంపీ దిలీప్‌ ఘోష్‌, కాంగ్రెస్‌ నాయకులు సుప్రియా శ్రీనెట్‌లకు ఈసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 29న సాయంత్రం 5 గంటల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 
 
హిమాచల్‌ప్రదేశ్‌లోని మండి లోక్‌సభ స్థానం నుంచి బాలీవుడ్‌ నటి కంగనాకు బీజేపీ టికెట్‌ కేటాయించిన విషయం తెలిసిందే. అయితే, కాంగ్రెస్‌ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనెట్‌ కంగనా ఫొటోను షేర్‌ చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేయగా, ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగింది. దాంతో ఆమె పోస్టులు డిలీట్‌ చేశారు. 
 
తన ఇన్‌స్టా అకౌంట్‌ యాక్సెస్‌ చాలా మంది వద్ద ఉందని, అందులో ఎవరో ఒకరు పెట్టి ఉంటారని ఆమె పేర్కొన్నారు. మరోవంక, కంగ‌నా ర‌నౌత్ ‌పై అభ్యంతర వ్యాఖ్యలు చేసిన సుప్రియా శ్రీనాతేకు కాంగ్రెస్‌ పార్టీ కూడా గట్టి షాక్‌ ఇచ్చింది. 2019లో ఉత్తరప్రదేశ్‌ లోని మహరాజ్‌గంజ్‌ నుంచి సుప్రియా శ్రీనాతే పోటీ చేసి ఆమె బీజేపీ అభ్యర్థి పంకజ్‌ చౌదరి చేతిలో ఓటమిపాలైంది.
అయితే ఈ సారి ఎలాగైన అదే స్థానం నుంచి గెలవాలని భావించగా, కంగనతో రాజకీయ వివాదం నేపథ్యంలో తాజాగా విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్థుల జాబితాలో ఆమెను పక్కకు పెట్టేసింది. ఆమె స్థానంలో పార్టీ తరఫున వీరేంద్ర చౌదరికి  అవకాశం కల్పించింది.
అలాగే బెంగాల్‌కు చెందిన సీనియర్‌ బీజేపీ నేత, ఎంపీ దిలీప్‌ ఘోష్‌ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన కార్యకర్తలు బీజేపీ జాతీయ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు.  దీనికి స్పందించిన జేపీనడ్డా వివరణ ఇవ్వాలని నోటీసు జారీ చేశారు. ఆ తర్వాత దిలీప్‌ ఘోష్‌ క్షమాపణలు చెప్పారు. తాను చేసిన వ్యాఖ్యలపై చింతిస్తున్నానని తెలిపారు. ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను టీఎంసీ ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈ క్రమంలో ఇద్దరు నేతలకు ఈసీ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. 
కాగా, ముఖ్యమంత్రి మమతా బెనర్జీపైఅభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు గానూ దిలీప్ ఘోష్ పై భారత శిక్షాస్మృతిలోని 504, 509 సెక్షన్ల కింద దుర్గాపూర్‌ పీఎస్‌లో కేసు నమోదైనట్లు అధికారులు గురువారం వెల్లడించారు. ఎన్నికల సందర్భంగా ఏ రాష్ర్టానికి వెళ్తే ఆ రాష్ట్రం కుమార్తెనని మమతా బెనర్జీ చెపుతున్నారని, ఇంతకీ ఆమె తండ్రి ఎవరో స్పష్టం చేయాలని వ్యాఖ్యానించారు. దిలీప్‌ వ్యాఖ్యలు రాజకీయంగా, వ్యక్తిగతంగా తీవ్ర దుమారం రేపాయి.