కేజ్రీవాల్ అరెస్టులో అమెరికా స్పందనపై భారత్ అభ్యంతరం

లిక్కర్ స్కామ్‌కి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ అరెస్టుపై ఇటీవల అగ్రరాజ్యం అమెరికా  స్పందించడం పట్ల భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. భారత్‌లోని ప్రతిపక్ష నేత (కేజ్రీవాల్) అరెస్టుకు సంబంధించిన నివేదికలను అమెరికా ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని, ఈ కేసులో సమయానుకూల, పారదర్శక న్యాయ విచారణను ప్రోత్సాహిస్తున్నామని అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మంగళవారం చెప్పుకొచ్చారు. 

అంతర్గత విషయాల్లో ఇలా జోక్యం చేసుకోవడం తగదని భారత్ మండిపడింది. కేజ్రీవాల్ అరెస్టుపై  అమెరికా విదేశాగ శాఖ అధికార ప్రతినిధి స్పందించడంపై అమెరికా రాయబార కార్యాలయం డిప్యూటీ చీఫ్‌ ఆఫ్‌ మిషన్‌ గ్లోరియా బెర్బేనాకు  సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే ఆమె బుధవారం సౌత్‌ బ్లాక్‌లోని విదేశాంగ శాఖ కార్యాలయానికి వచ్చారు. 

సుమారు 40 నిమిషాలపాటు ఈ సమావేశం కొనసాగగా ఆమె వద్ద భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ‘‘దౌత్య సంబంధాల్లో భాగంగా దేశాలు ఇతరుల సార్వభౌమాధికారం, అంతర్గత వ్యవహారాలను గౌరవించాలని మేం భావిస్తున్నాం. మరీ ముఖ్యంగా తోటి ప్రజాస్వామ్య దేశాల విషయంలో ఈ బాధ్యత మరింత ఎక్కువగా ఉంటుంది. లేదంటే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది’’ అని అమెరికాకు భారత్ స్పష్టంగా చెప్పింది. 

అంతేకాదు భారత న్యాయ ప్రక్రియలు స్వతంత్ర న్యాయవ్యవస్థపై ఆధారపడి ఉంటాయని, ఇందులో కచ్చితమైన, సమయానుకూల ఫలితాలు వస్తాయని పేర్కొంటూ దీనిపై అంచనాలు వేయడం సరికాదని భారత విదేశాంగ శాఖ తెలిపింది. అన‌వ‌స‌ర‌మైన ఆశ‌యాల‌తో చేసే వ్యాఖ్య‌లు అనారోగ్య‌క‌ర‌మైన ప‌రిణామాల‌కు దారి తీస్తుంద‌ని హెచ్చరించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. 

ఇత‌ర దేశాల సార్వ‌భౌమ‌త్వాన్ని, అంత‌ర్గ‌త వ్య‌వ‌హారాల‌ను ఆయా దేశాలు గౌర‌వించాల‌ని, ఇక ప్ర‌జాస్వామ్య దేశాల విష‌యంలో ఆ బాధ్య‌త మ‌రింత ఎక్కువ‌గా ఉండాల‌ని, లేదంటే అనారోగ్య‌క‌ర‌మైన ప‌రిణామాల‌కు వ్య‌వ‌హారం దారి తీస్తుంద‌ని విదేశాంగ శాఖ త‌న హెచ్చరికలో పేర్కొన్న‌ది.