ఫెమా ఉల్లంఘనల్లో షిప్పింగ్ కంపెనీల్లో ఈడీ సోదాలు

దేశవ్యాప్తంగా పలు షిప్పింగ్ కంపెనీల కార్యాలయాల్లో ఈడీ జరిపిన తనిఖీల్లో భారీగా నగదు దొరికింది. ఈ సోదాల్లో వాషింగ్ మెషీన్ లో భారీగా నగదు దొరకడం విస్మయం కలిగించింది. విదేశీ మారకద్రవ్య చట్టాన్ని ఉల్లంఘించారన్న ఆరోపణల కాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్స్, దాని డైరకర్లు, అనుబంధ సంస్థల్లో ఈడీ సోదాలు చేపట్టింది. 
 
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ తనిఖీల్లో లెక్కల్లో చూపని రూ. 2.54 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది. ఈ నగదులో కొంత భాగాన్ని వాషింగ్ మెషీన్‌లో దాచిపెట్టినట్లు అధికారులు గుర్తించారు. 
 
కాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్స్ కంపెనీ, దాని డైరెక్టర్లు విజయ్ కుమార్ శుక్లా, సంజయ్ గోస్వామి, లక్ష్మీటన్ మారిటైమ్, హిందూస్తాన్ ఇంటర్నేషనల్, రాజ్‌నందిని మెటల్స్ లిమిటెడ్, స్టావర్ట్ అల్లాయ్స్ ఇండియా, భాగ్యనగర్ స్టీల్స్, వినాయక్ స్టీల్స్, వశిష్ట కన్‌స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సంస్థల డైరెక్టర్లు, భాగస్వాములు సందీప్ గార్గ్, వినోద్ కేడియా, ఇతరుల ఇళ్లు, కార్యాలయ్యాల్లో ఈడీ ఏకకాలంలో సోదాలు చేపట్టింది. 
 
ఈ సంస్థల కార్యాలయాలు ఉన్న దిల్లీ, హైదరాబాద్, ముంబయి, కురుక్షేత్ర, కోల్‌కతాలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు చేశారు.  ఈ సందర్భంగా  పలు కీలక పత్రాలు, డిజిటల్ పరికరాలు, లెక్కలు చూపని రూ. 2.54 కోట్ల నగదును అధికారులు గుర్తించి సీజ్ చేశారు. ఈ సంస్థలకు చెందిన 47 బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశామని ఈడీ ఓ ప్రకటనలో పేర్కొంది. వీటిల్లో వశిష్ట కన్ స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వినాయక్ స్టీల్స్ లిమిటెడ్, భాగ్యనగర్ లిమిటెడ్ హైదరాబాద్ కు చెందిన కంపెనీలుగా తెలుస్తోంది. 
 
ఈ సంస్థలు విదేశాలకు భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని పంపుతున్నాయన్న ఆరోపణలతో ఉన్నాయి. సింగపూర్ కు గెలాక్సీ షిప్పింగ్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, హారిజోన్ షిప్పింగ్ సంస్థలకు అనుమానాస్పదంగా రూ. 1,800 కోట్ల మేర విదేశీ చెల్లింపులు చేసినట్లు అందిన సమాచారంతో ఈడీ దర్యాప్తు చేపట్టింది. ఈ రెండు విదేశీ సంస్థలు ఆంథోనీ డి సిల్వా నిర్వహిస్తు్న్నారు.

కాప్రికార్నియన్ షిప్పింగ్ లాజిస్టిక్స్ కంపెనీ, లక్ష్మీటన్ మారిటైమ్, తమ అసోసియేట్లతో కలిసి సింగపూర్‌కు చెందిన సంస్థలకు బోగస్ సరకు రవాణా, దిగుమతులు చేసినట్లు ఈడీ గుర్తించింది. దీంతో పాటు అక్రమంగా రూ.1,800 కోట్ల మేర చెల్లింపులు చేసినట్లు దర్యాప్తులో తేలింది. నేహా మెటల్స్, అమిత్ స్టీల్ ట్రేడర్స్, ట్రిపుల్ ఎమ్ మెటల్ అల్లాయ్స్, హెచ్ఎమ్ఎస్ మెటల్స్ మొదలైన షెల్ కంపెనీల సహాయంతో ఈ లావాదేవీలు జరిగాయని ఈడీ తెలిపింది.