హోలీ రోజంతా కవితను ప్రశ్నలతో ముంచెత్తిన ఈడీ

ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో విచారణ ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవితను నిర్దుష్టమైన ఆధారాలతో ఈడీ అధికారులు ముంచెత్తుతూనే ఉన్నారు. తమ కస్టడీలో ఉన్న కవితతో పాటు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కూడా నిశితంగా విచారిస్తున్నారు. సోమవారం హోలీ కావడంతో సెలవు దినమైనాకవితను ఊపిరాడనివ్వకుండా ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు ఈడీ అధికారులు.

ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆమె మేనల్లుడు మేక శరణ్ పాత్ర ఏమిటి? డబ్బులు ఎలా చేతులు మారాయి? ఎవరెవరికి మధ్య లావాదేవీలు జరిగాయి? తదితర అంశాలను ఈడి ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అంతేకాదు కవిత, ఆమె భర్త అనిల్, కవిత వద్ద పనిచేసే వ్యక్తిగత సహాయకుల నుండి స్వాధీనం చేసుకున్న మూడు మొబైల్ ఫోన్ల నుండి డేటాను కవిత ముందుంచి దాని పైన కూడా ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

ఇక కవితను మద్యం వ్యాపారి సమీర్ మహేంద్రు పాత్రపై కూడా గట్టిగానే ప్రశ్నించినట్లు సమాచారం. ఆమె కస్టడీ సమయం ముగియడంతో మంగళవారం  ఉదయం 11 గంటలకు మళ్ళీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశ పెట్టవలసిన క్రమంలో, సోమవారం నాడు కవితను ఊపిరాడనివ్వకుండా అనేక ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు ఈడీ అధికారులు.

 మరోవైపు కేజ్రీవాల్ ను కూడా విచారిస్తున్న క్రమంలో, వీరిద్దరు చెప్పే సమాధానాలలో పోలికలను బేరీజు వేసే పనిలో ఉన్నారు. అయితే వీరిద్దరు విచారణకు సహకరించడం లేదన్నది ఈడి అధికారుల వాదన. కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో సంపాదించిన డబ్బుతో నిజామాబాద్ తో పాటు ఏపీలో కూడా పలు వ్యాపారాల్లో ఉన్నారని, వీటన్నిటి వివరాలను కూడా రాబట్టే పనిలో ఉంది ఈడి.