ఇదో జాబితాలో 111 మంది అభ్యర్థులను ప్రకటించిన బిజెపి

 
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఐదవ జాబితాను బీజేపీ ఆదివారం విడుదల చేసింది. ఈ జాబితాలో నటి కంగనా రనౌత్‌కి కూడా బీజేపీ టిక్కెట్టు ఇచ్చింది. హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి బీజేపీ లోక్‌సభ అభ్యర్థిగా కంగనా పోటీ చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ నుండి బీజేపీలో చేరిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్‌ను హర్యానాలోని కురుక్షేత్ర నుంచి పోటీకి దింపినట్లు పార్టీ ప్రకటించింది.
 
మాజీ కేంద్ర మంత్రులు మేనకా గాంధీ, జితిన్‌ ప్రసాద, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌, రవిశంకర్ ప్రసాద్‌ సహా పలువురి పేర్లు జాబితాలో ఉన్నాయి. ఫిలిభిత్‌ సిట్టింగ్‌ ఎంపీ వరుణ్ గాంధీకి టికెట్‌ నిరాకరించింది. ఆయన స్థానంలో ఇటీవల పార్టీలో చేరిన జితిన్‌ ప్రసాదకు బీజేపీ టికెట్‌ ఇచ్చింది. ఆయన తల్లి మేనకా గాంధీకి సుల్తాన్‌పూర్‌ టికెట్‌ను కేటాయించింది.
 
స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఇటీవలే బీజేపీలో చేరిన కోల్‌కత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి అభిజిత్ గంగోపాధ్యకు బెంగాల్‌లోని తామ్‌లుక్ సీటు కేటాయించింది. ఇక ఒడిశాలో సంభల్‌పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పూరీ నుంచి సంబిత్ పాత్రలను పోటీకి నిలబెట్టింది.

చంద్రాపూర్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా సుధీర్‌ ముంగుంటివార్‌పై మాజీ ఎంపీ సురేశ్‌ ధనోర్కర్‌ భార్య ప్రతిభా ధనోర్కర్‌ను కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలిపింది. బక్సర్ నుంచి అశ్విని చౌబే టికెట్ రద్దు చేయగా, పశ్చిమ చంపారన్ నుంచి సంజయ్ జైస్వాల్‌కు టికెట్ ఇచ్చారు.

వయనాడ్ నుంచి రాహుల్ గాంధీపై పోటీ చేసేందుకు సురేంద్రన్‌కు టిక్కెట్టు ఇచ్చారు. తూర్పు చంపారన్‌ నుంచి రాధామోహన్‌సింగ్‌కు, బెగుసరాయ్‌ నుంచి గిరిరాజ్‌సింగ్‌కు టికెట్‌ ఇచ్చారు. ఉజియార్‌పూర్‌ నుంచి నిత్యానంద్‌కు టికెట్‌ ఇచ్చారు. రామాయణంలో రాముడి పాత్ర పోషించిన అరుణ్ గోవిల్ మీరట్-హపర్ లోక్‌సభ స్థానం నుంచి అభ్యర్థిగా ఎంపికయ్యారు

గత వారమే బీజేపీలో చేరిన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ వదినగారైన సీత సొరేన్ అదే రాష్ట్రంలోని దుంకా నుండి పోటీచేయనున్నారు.  బీజేపీ ఐదో జాబితాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు బిహార్, గుజరాత్, గోవా, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, జార్ఖండ్, కేరళ, కర్ణాటక మహారాష్ట్ర, ఒడిశా, మిజోరాం, రాజస్థాన్, సిక్కిం, పశ్చిమ బంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల నుండి మొత్తం 111 అభ్యర్థులను ఖరారు చేసింది.
 
ఐదో జాబితాలో రాష్ట్రాల వారీగా ఏపీలో ఆరుగురు, బిహార్‌లో 17, గోవా నుంచి ఒకరికి, గుజరాత్‌ నుంచి ఆరుగురు, హర్యానా నుంచి నలుగురు, హిమాచల్‌ప్రదేశ్‌ నుంచి ఇద్దరు, జార్ఖండ్‌లో ముగ్గురు, కర్ణాటక నుంచి నలుగురు, కేరళలో నలుగురు, మహారాష్ట్రలో ముగ్గురు, ఒడిశాలో 18 మంది, రాజస్థాన్‌లో ఏడుగురు, సిక్కిం నుంచి ఒక్కరు, తెలంగాణ నుంచి ఇద్దరు, ఉత్తరప్రదేశ్‌ నుంచి 13 మందికి టికెట్లు కేటాయించింది.
 
ఇప్పటి వరకు మొత్తం 402 మంది లోక్ సభ అభ్యర్థులని బీజేపీ ప్రకటించింది. తొలి జాబితాలో 195 మంది, రెండో జాబితాలో 72 మంది, మూడో జాబితాలో 9 మంది, నాలుగో జాబితాలో 15 మంది, ఐదో జాబితాలో 111 మంది అభ్యర్థుల పేర్లను బీజేపీ అధిష్ఠానం ప్రకటించింది.