ఉగ్రవాదులకు ఉక్రెయిన్‌తో సంబంధం… పుతిన్ ఆరోపణ

రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం రాత్రి జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య 150కి పెరిగింది. ఈ మారణహోమం తమ పనేనని ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్‌ స్టేట్‌ అఫ్ఘానిస్థాన్‌ శాఖ ప్రకటించగా, ఉగ్రవాదులకు ఉక్రెయిన్‌తో సంబంధాలున్నాయని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ ఆరోపించారు. దీనిని ఉక్రెయిన్‌ తీవ్రంగా ఖండించింది. తమతో యుద్ధాన్ని మరింతకాలంపాటు పొడిగించటానికే పుతిన్‌ ఈ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని విమర్శించింది. 

ఉగ్రదాడి నేపథ్యంలో పుతిన్‌ శనివారం జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తూ దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న నలుగురు పారిపోయి, ఉక్రెయిన్‌ సరిహద్దు దాటటానికి ప్రయత్నిస్తూ పట్టుబడ్డారని తెలిపారు. వారితోపాటు మొత్తం 11 మందిని భద్రతా దళాలు అరెస్టు చేశాయన్నారు. దాడిని పాశవిక ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు.

రష్యాలో జరిగిన దాడి తమ పనేనని ఇస్లామిక్‌ స్టేట్‌ (ఐఎస్‌) ఉగ్రసంస్థ అఫ్ఘానిస్థాన్‌ శాఖ ప్రకటించింది. మాస్కో సమీపంలో భారీ సంఖ్యలో సమావేశమైన క్రైస్తవులపై దాడి జరిపి పెద్ద ఎత్తున విధ్వంసం సృష్టించామని, తమ ఫైటర్లు తిరిగి సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని తమ సోషల్‌ మీడియా ఖాతాల్లో వెల్లడించింది. 

దాడి ఇస్లామిక్‌ స్టేట్‌ పనేనన్న సంగతిని అమెరికా కూడా ధ్రువీకరించింది. మాస్కోపై దాడికి ఐఎస్‌ కుట్ర పన్నుతోందని తమకు లభించిన సమాచారాన్ని రష్యాకు ఈ నెలలోనే అందజేశామని అమెరికా అధికారులు వెల్లడించారు. దీనిపై అప్పట్లో వార్తలు రాగా ఇదంతా రష్యన్లను భయపెట్టటానికి అమెరికా చేస్తున్న ప్రచారంలో భాగమని పుతిన్‌ కొట్టివేశారు. 

కాగా, సిరియాలో 2012లో చెలరేగిన అంతర్యుద్ధంలో ఆ దేశ ప్రతిపక్షం, ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రసంస్థ.. దేశాధ్యక్షుడు బషార్‌ అల్‌ అస్సాద్‌పై సాయుధ పోరు జరిపాయి. ఈ అంతర్యుద్ధంలో రష్యా అధ్యక్షుడు పుతిన్‌.. అస్సాద్‌కు మద్దతుగా 2015లో తమ సైన్యాన్ని పంపించారు. దీంతో తిరుగుబాటు విఫలమైంది. ఈ నేపథ్యంలోనే, పుతిన్‌పై ఇస్లామిక్‌ స్టేట్‌ ప్రతీకారం తీర్చుకోవటానికి తాజా దాడి జరిపినట్లుగా భావిస్తున్నారు.

రష్యా అధికారులు చేస్తున్న ప్రకటనలను ఉక్రెయిన్‌ తీవ్రంగా ఖండించింది. ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. యుద్ధాన్ని మరింతకాలంపాటు పొడిగించటానికి, రష్యన్లలో ఉక్రెయిన్‌ వ్యతిరేక ఉన్మాదాన్ని రెచ్చగొట్టటానికి, అంతర్జాతీయంగా ఉక్రెయిన్‌ను దోషిగా నిలబెట్టటానికి రష్యా ఈ ఆరోపణలు చేస్తోందని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సలహాదారు పేర్కొన్నారు.