గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా విశాఖ

విశాఖ గంజాయి, డ్రగ్స్‌కు రాజధానిగా మారిందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్యెల్యే విష్ణుకుమార్ రాజు ధ్వజమెత్తారు. భారతదేశంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కడ దొరికినా మూలాలు మాత్రం ఏపీలోనే ఉంటున్నాయని మండిపడ్డారు. విద్యార్థులు గంజాయికి బానిసలు అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గంజాయి కంట్రోల్ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 

విశాఖ పోర్టులో దొరికిన డ్రగ్స్‌పై లోతైన విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ డగ్స్ వ్యవహరంపై కులాలకు ఆపాదించడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరికి, వారి బంధువులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు. కేవలం బీజేపీపై బురద జల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సీబీఐను అడ్డుకున్న ఘనత జగన్ మోహన్ రెడ్డిదే అంటూ వ్యాఖ్యలు చేశారు. 18 కేసులు ఉన్న వ్యక్తి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరమని చెబుతూ విశాఖ ఎయిర్ ఫోర్టులో చంద్రబాబుపై కోడిగుడ్లు వేసిన పార్టీ వైసీపీ అంటూ విరుచుకుపడ్డారు. 

కేకే రాజు తనపై దుష్పచారం చేస్తున్నారని తెలుపుతూ కేకే రాజు చేస్తున్న పనులు ప్రజలందిరికి తెలుసని విమర్శించారు. మహిళలు అంటే తనకు అపారమైన గౌరవం ఉందని పేర్కొంటూ తన వలన మహిళలు ఎవ్వరైనా ఇబ్బంది పడితే క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. మహిళల పుస్తులును జగన్ తెంచుతున్నారని విష్ణుకుమార్ రాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.