దేశంలో 100 నుంచి 1.25 లక్షలకు చేరుకున్న స్టార్ట్‌ప్ లు

కేంద్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చాక దేశంలో స్టార్ట్‌ప్ ల సంఖ్య గణనీయంగా పెరిగిందని చెబుతూ 2014లో వందలోపు ఉన్న స్టార్ట్‌ప్ లు ప్రస్తుతం 1.25 లక్షలకు చేరుకున్నాయని, వాటితో దాదాపు 12 లక్షల మంది యువత ప్రత్యక్షంగా అనుబంధాన్ని కలిగి ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ప్రపంచంలోనే భారత్‌ మూడో అతిపెద్ద స్టార్ట్‌ప్ ల దేశమని, మన వద్ద వందకుపైగా యూనికార్న్‌లున్నాయని వెల్లడించారు. 

భారతీయ స్టార్ట్‌పలు 12 వేలకుపైగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకున్నాయని, ఈ సంఖ్య మరింత పెరగాలని మోదీ సూచించారు. వేగంగా మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు పేటెంట్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో మూడు రోజులుగా జరుగుతున్న ‘స్టార్టప్‌ మహాకుంభ్‌’ను మోదీ బుధవారం సందర్శించి ప్రసంగించారు.

ఐటీ రంగంలో ఒక స్టార్టప్‌ విజయం సాధించకపోతే మరో స్టార్ట్‌పను తీసుకొస్తారని  కానీ, రాజకీయాల్లో మాత్రం కొందరిని పదేపదే ప్రయోగించాల్సి వస్తోందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీని ఉద్దేశించి ప్రధానిమోదీ చెణుకులు విసిరారు. ‘స్టార్ట్‌ప్ లను లాంచ్‌ చేసే వారి సంఖ్య ఎక్కువే. రాజకీయాల్లో ఇటువంటి వారి సంఖ్య మరింత ఎక్కువ. స్టార్ట్‌ప్ ల రంగం ప్రయోగాత్మకంగా ఉంటుంది. ఒకటి విఫలమైతే మరో కొత్తదాని కోసం పరిశోధిస్తారు. కానీ, రాజకీయాల్లో అలా లేదు. కొందరిని పదే పదే లాంచ్‌ చేయాల్సి వస్తోంది’ అంటూ రాహుల్‌ పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా ఎద్దేవా చేశారు. 

ఎన్నికల తర్వాత వరుసగా మూడోసారి ప్రభుత్వంలోకి వచ్చి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెడతామని మోదీ ధీమా వ్యక్తం చేశారు. సాధారణంగా ఎన్నికలు ముగిసిన తర్వాతే వ్యాపార, వాణిజ్య సంస్థలు భారీ కార్యక్రమాలు పెట్టుకుంటాయని, కానీ, పెద్ద ఎత్తున జరుగుతున్న స్టార్టప్‌ మహాకుంభ్‌ కార్యక్రమం మళ్లీ తమ ప్రభుత్వమే వస్తుందనటానికి ఓ సంకేతమని చెప్పారు. 

ఒకప్పుడు విద్య అంటే ఉద్యోగం కోసమేనని, ప్రభుత్వ ఉద్యోగం వస్తేనే జీవితంలో స్థిరపడ్డామనే అభిప్రాయాలు ఉండేవని.. ఇప్పుడు ఆ ఆలోచనా ధోరణి మారిందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. భారతీయ యువత ఉద్యోగాలు అడగటం లేదని, ఉద్యోగాలను సృష్టిస్తోందని తెలిపారు. ఇదంతా దేశాన్ని ఊపేస్తోన్న స్టార్టప్‌ విప్లవం వల్లే సాధ్యమైందని చెప్పారు. 

గతంలో ఏదైనా కొత్త ఆలోచనతో ఉన్న వారికి దానిని ఆచరణలో పెట్టాలంటే నిధులు ఎవరు సమకూరుస్తారన్న బెంగ ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి లేదని తెలిపారు. యువత తమ సామర్థ్యాన్ని చాటుకుంటోందని ప్రశంసించారు. అంతరిక్షం వంటి పలు రంగాల్లో భారతీయ స్టార్ట్‌పలు గొప్ప ఫలితాలను సాధిస్తున్నాయన్నారు.