ఈసీ వెబ్‌సైట్‌లో పూర్తి వివరాల వెల్లడి

ఎన్నికల బాండ్లకు సంబంధించిన పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు గురువారం అల్ఫా-న్యూమెరిక్‌ నంబర్లతో కూడిన ఎన్నికల బాండ్ల వివరాలను ఎన్నికల కమిషన్‌కు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) అందించింది. 
 
ఈ వివరాలను ఎన్నికల కమిషన్‌.. తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేసింది. ఎన్నికల బాండ్ల దాతలు, అందుకున్న వారి వివరాలతో కూడిన రెండు వేర్వేరు జాబితాలను వెబ్‌సైట్‌లో పెట్టింది. వీటిల్లోని వివరాల ఆధారంగా ఏ పార్టీకి ఎవరు ఎన్నికల బాండ్లు ఇచ్చారనేది వెల్లడి కానుంది. కాగా, ఎన్నికల బాండ్ల పూర్తి వివరాలు ఈసీకి అందించినట్టు గురువారం సుప్రీంకోర్టులో ఎస్బీఐ అఫిడవిట్‌ దాఖలు చేసింది. 
 
ఎన్నికల బాండ్ల దాతలు, అందుకున్న వారికి సంబంధించి కేవైసీ వివరాలు, పూర్తి బ్యాంక్‌ అకౌంట్‌ నెంబర్లను మాత్రం భద్రతా కారణాల దృష్ట్యా బహిర్గతం చేయలేమని సుప్రీంకోర్టుకు ఎస్బీఐ తెలిపింది. బాండ్లు కొన్న వారి పేర్లు, బాండ్ల విలువ, నంబరు, బాండ్లను ఎన్‌క్యాష్‌ చేసుకున్న పార్టీ పేరు, పార్టీ బ్యాంక్‌ అకౌంట్‌ చివరి నాలుగు అంకెలు వంటి వివరాలను ఈసీకి అందించామని, ఈ వివరాల ద్వారా దాతలెవరో, అందుకున్న రాజకీయ పార్టీలేవో తెలిసిపోతుందని ఎస్బీఐ పేర్కొన్నది.
 
ఇలా ఉండగా, ఎన్నికల బాండ్ల రూపంలో కాకుండా దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు 2013-2023 నడుమ అందిన నిధులు రూ.7,726 కోట్లు. అందులో సింహభాగం, దాదాపు రూ.5000 కోట్లు (ఇంచుమించుగా 64.7 శాతం) బీజేపీకే అందాయని ఎలక్షన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా సమాచారం ఆధారంగా బిజినె్‌సలైన్‌ వార్తా సంస్థ ఒక కథనాన్ని ప్రచురించింది.  దాని ప్రకారం 10.7 శాతం నిధులతో కాంగ్రెస్‌, 3.3 శాతం నిధులతో బీఆర్‌ఎస్‌, 3.1శాతం  నిధులతో ఆప్‌ బీజేపీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.
మోదీ సర్కారు రూపొందించిన ఎలక్టోరల్‌ బాండ్ల పథకం 2018లో అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. అంతకు ముందున్న విధానంలో  రూ.20 వేల కంటే ఎక్కువ మొత్తంలో వచ్చే విరాళాల వివరాలను పార్టీలు ప్రకటించాల్సి ఉంటుంది. 2014 నాటికి ఇలాంటి విరాళాల విలువ రూ.309 కోట్లుగా ఉండగా, 2020 నాటికి రూ.1,247 కోట్లకు చేరింది. 2023లో అలాంటి విరాళాలు రూ.1,101 కోట్లకు తగ్గడం గమనార్హం.