‘ఇండియా’ కూటమికే ఎక్కువ విరాళాలు

ఎలక్టోరల్ బాండ్లను అతిపెద్ద దోపిడీ రాకెట్ గా కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అభివర్ణించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. గాంధీకి కూడా రూ.1,600 కోట్లు వచ్చాయనీ, ఆ ‘హఫ్తా వసూలీ’ ఎక్కడి నుంచి వచ్చిందో ఆయన వివరించాలని న్యూస్ 18 రైజింగ్ భారత్ సమ్మిట్‌లో మాట్లాడుతూ ఎద్దేవా చేశారు. ఎలక్టోరల్ బాండ్స్‌ అనేవి పారదర్శకమైన విరాళాలని, అయితే అది వసూలీగా ఆయన చెబుతున్నారంటే దానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని అమిత్‌షా ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ చెప్పారు.

భారతీయ జనతా పార్టీ భారీగా విరాళాలు అందుకున్నట్టు వస్తున్న ఆరోపణలపై అమిత్‌షాను ప్రశ్నించగా, ఇది పూర్తిగా తప్పని ఆయన సమాధానమిచ్చారు. ”మాకు రూ.6,200 కోట్లు వచ్చాయి. రాహుల్ సారథ్యంలోని ‘ఇండియా’ కూటమికి రూ.6,200 కోట్ల కంటే ఎక్కువే వచ్చాయి. మాకు 303 సీట్లు ఉన్నాయి. 17 రాష్ట్రాల్లో మా ప్రభుత్వాలు ఉన్నాయి. ఇండియా కూటమికి  ఎన్ని ఉన్నాయి?” అని అమిత్‌షా ప్రశ్నించారు.

ఎలక్టోరల్ బాండ్లు రాజ్యాంగవిరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పడంపై అమిత్‌షా మాట్లాడుతూ, అత్యున్నత న్యాయస్థానం తీర్పును తాము గౌరవిస్తామని, అయితే ఎన్నికల బాండ్లతో రాజకీయాల్లో నల్లధనం దాదాపు కనుమరుగైందని స్పష్టం చేశారు. ఎలక్టోరల్ బాండ్లకు విపక్ష కూటమి వ్యతిరేకిస్తుంది కదా అని అడిగినప్పుడు, రాజకీయాలను శాసించే కట్ మనీ సిస్టమ్‌ను తిరిగి తేవాలని వారనుకుంటున్నారని అమిత్‌షా బదులిచ్చారు.

కాగా, ఇప్పుడు జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలలో బిజెపి 2014 ఎన్నికల కన్నా అధిక సీట్లను గెలుచుకుంటుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. అన్ని వారసత్వ పార్టీలకు ప్రజలు గట్టిగా బుద్ధి చెబుతారని ఆయన స్పష్టం చేశారు.  లౌకిక దేశంలో ప్రజలందరికీ ఒకే చట్టం ఉండాలని విశ్వసిస్తున్న బిజెపికి ఈ ఎన్నికల్లో ఉమ్మడి పౌర స్మృతి(యుసిసి) అజెండాగా ఉండనున్నదని ఆయన తెలిపారు. 

ఉత్తర్ ప్రదేశ్‌లో గత ఎన్నికలతో పోలిస్తే అధిక లోక్‌సభ స్థానాలను బిజెపి గెలుచుకుంటుందని విశ్వాసనం వ్యక్తం చేశారు.1950 నుంచి యుసిసిని తాము లెవనెత్తుతున్నామని, దీని కోసం తమ పార్టీ పోరాడిందని షా చెప్పారు. దీని నుంచి తాము పక్కకకు తప్పుకోలేమని తెలిపారు. లౌకికవాద దేశంలో అందరికీ ఒకే చట్టం ఉండాలని తాము విశ్వసిస్తున్నామని చెప్పారు. దేశ ప్రజలకు బిజెపి ఇచ్చే కానుకగా యుసిసిని అభివర్ణించారు. 

పౌరసత్వ సవరణ చట్టంపై(సిఎఎ) ప్రతిపక్షాలు ప్రజలలో అపోహలు సృష్టిస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఇటీవల సిఎఎకి సంబంధించిన నిబంధనలను ప్రభుత్వం జారీచేయడాన్ని ప్రస్తావిస్తూ దేశంలోని మైనారిటీల పౌరసత్వాన్ని సిఎఎ లాగేసుకుంటుందన్న దుష్ప్రచారాన్ని ప్రతిపక్షాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు. 

 అయితే ఎవరి పౌరసత్వాన్ని సిఎఎ తొలగించబోదని ఆయన స్పష్టం చేశారు. పాకిస్తాన్, అఫ్ఘానిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్శీ మతాలకు చెందిన శరణార్థులకు మాత్రమే భారత పౌరసత్వం అందచేస్తామని అమిత్ షా తెలిపారు.