బీజేపీలో చేరిన హేమంత్‌ సోరెన్‌ వదిన

* బీజేపీలో మాజీ అమెరికా రాయబారి త‌రన్‌జిత్ సింగ్ సంధూ
 
లోక్‌సభ ఎన్నికల ముందు జార్ఖండ్‌లో అధికార జేఎంఎం పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే, మాజీ సీఎం హేమంత్‌ సోరెన్‌ సొంత వదిన సీతా సోరెన్‌ జేఎంఎంకు రాజీనామా చేశారు. అనంతరం ఆమె బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆమె ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత 14 ఏండ్లుగా తాను పార్టీ కోసం పనిచేస్తున్నా తనకు గౌరవం దక్కలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. జేఎంఎంలో తగిన గౌరవం దక్కనందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షాల మీద ఉన్న నమ్మకంతో తాను బీజేపీలో చేరుతున్నానని చెప్పారు. 

కాగా, మూడు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన సీతా సోరెన్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ అన్న దుర్గా సోరెన్ స‌తీమ‌ణి. దుర్గా సోరెన్ 2009లో 39 ఏండ్ల వ‌య‌సులో మ‌ర‌ణించారు. త‌న భ‌ర్త మ‌ర‌ణానంత‌రం తనను, త‌న కుటుంబాన్ని అగౌర‌వ‌ప‌రిచే విధంగా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని రాజీనామా లేఖ‌లో సీతా సోరెన్ పేర్కొన్నారు. పార్టీ స‌భ్యులు, కుటుంబం త‌మ‌ను వేరుచేసే విధంగా వ్యవ‌హ‌రించ‌డం త‌న‌ను తీవ్రంగా క‌లిచివేసింద‌ని తెలిపారు. కాలంతోపాటు ప‌రిస్ధితులు మార‌త‌యాని తాను సహనంతో ఉన్నప్పటికీ త‌న భ‌ర్త విడిచిపెట్టిన ఆశ‌యాలను ముందుకు తీసుకెళ్లడంలో పార్టీ చొర‌వ చూప‌డం లేద‌ని ఆరోపించారు.

బీజేపీలో చేరిన త‌ర‌న్‌జిత్ సింగ్ సంధూ

గ‌తంలో అమెరికాకు భార‌తీయ అంబాసిడ‌ర్‌గా చేసిన త‌రన్‌జిత్ సింగ్ సంధూ మంగళవారం బీజేపీలో చేరారు. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో ఆయ‌న ఆ పార్టీ త‌ర‌పున పంజాబ్‌లోని అమృత్‌స‌ర్ నుంచి పోటీ చేసే అవ‌కాశాలు ఉన్నాయి. ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు వినోద్ త‌వ‌డే, త‌రుణ్ చుగ్ సమ‌క్షంలో సంధూ పార్టీ చేరారు. అమెరికా, భార‌త్ మ‌ధ్య బంధం బ‌లోపేతం అయ్యింద‌ని సంధూ తెలిపారు. 
 
రెండు దేశాల మ‌ధ్య అభివృద్ధిపై ఫోక‌స్ చేశామ‌ని, సెమీకండ‌క్ట‌ర్ ప‌రిశ్ర‌మ‌లో ఇంకా వృద్ధి సాధించాల్సి ఉంద‌న్నారు. త‌న రాజ‌కీయ ఇన్నింగ్స్‌కు అవ‌కాశం ఇచ్చిన ప్ర‌ధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డాల‌కు ఆయ‌న ధన్యవాదాలు తెలిపారు.