నెల రోజుల్లో 15 శాతానికిపైగా దిగొచ్చిన ఎల్ఐసీ షేర్లు

* భారీగా నష్టపోతున్న దేశీయ స్టాక్ మార్కెట్లు
 
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. గత కొంత కాలంగా రికార్డు స్థాయి గరిష్టాలకు చేరగా ఇప్పుడు కరెక్షన్‌కు గురవుతున్నాయి. బొంబాయి స్టాక్ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ భారీగా పడిపోతున్నాయి. సెన్సెక్స్ మంగళవారం సెషన్‌లో 730 పాయింట్ల నష్టంతో 72 వేల మార్కు వద్ద స్థిరపడింది. 
 
నిఫ్టీ 230 పాయింట్లకుపైగా కోల్పోయి 21 వేల 800 పాయింట్ల వద్ద సెషన్‌ను ముగించింది. అయితే ఇదే క్రమంలో కొన్ని స్టాక్స్ భారీగా పతనం అవుతూ ఇన్వెస్టర్లకు తీరని శోకాన్ని మిగిలిస్తున్నాయి. వీటిల్లో ప్రధానంగా లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్ఐసీ) గత నెలరోజుల్లో 15 శాతం మేర పడిపోయింది.

ఎల్ఐసీ స్టాక్ మంగళవారం  2.71 శాతం పడిపోయి రూ. 879.85 వద్ద స్థిరపడింది. అయితే గత కొన్ని సెషన్లుగా ఇది వరుసగా పడిపోతూనే ఉంది. 5 రోజుల్లో ఏకంగా 11 శాతం తగ్గింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు చూసుకుంటే 2 శాతం మాత్రమే పెరిగింది.
కొద్దిరోజుల కిందట ఎల్ఐసీ ఉద్యోగులకు వేతనాల పెంపుపై ప్రకటన వచ్చింది. 
 
దాదాపు లక్ష మందికిపైగా ఉద్యోగులకు వేతనాల్ని 16 శాతం చొప్పున పెంచనున్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం నుంచి వేతనాల పెంపునకు ఆమోదం వచ్చిందని, ఇది 2022 ఆగస్ట్ 1 నుంచే అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. దీంతో సంస్థపై అదనంగా వార్షికంగా రూ. 4 వేల కోట్ల భారం పడనుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే షేరు ఇప్పుడు పడిపోతుండటం గమనార్హం.
 
ఎల్ఐసీ షేరు ఇటీవల రూ. 1175 వద్ద 52 వారాల గరిష్ట విలువను నమోదు చేసుకోండి. ఆ తర్వాత మాత్రం భారీగా పడిపోతుంది. ప్రస్తుతం రూ. 879 వద్ద షేరు ఉండగా, ఇది ఆల్ టైమ్ హై నుంచి చూస్తే 25 శాతం తక్కువ. గతేడాది నవంబర్ నుంచి ఈ సంవత్సరం ఫిబ్రవరి వరకు షేరు పెరుగుతూనే ఉండగా, దాదాపు 70 శాతం ఎగబాకింది. ఆ తర్వాత మాత్రం వరుసగా పడుతూనే ఉంది.

2022 మే నెలలో ఎల్ఐసీ స్టాక్ లిస్టింగ్ అయినప్పటి నుంచి ఇటీవల ఈ ఏడాదిలోనే ఇష్యూ ధరను దాటేసింది. జనవరిలో ఐపీఓ ధరను దాటింది. ఈ క్రమంలోనే ఎస్బీఐని కూడా దాటేసి అత్యంత విలువైన ప్రభుత్వ రంగ సంస్థగా నిలిచింది ఎల్ఐసీ. ఆ సమయంలో ఎల్ఐసీ మార్కెట్ విలువ రూ. 7 లక్షల కోట్ల మార్కును కూడా దాటగా ఇప్పుడు అది రూ.5.56 లక్షల కోట్లకు దిగొచ్చింది.