గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించిన బ్యాంకు అఫ్ ఇండియా

ప్రముఖ ప్రభుత్వ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ ఇండియా గృహ రుణాలపై వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం 8.45 శాతం వడ్డీ రేటుతో ప్రారంభం అవుతుండగా దీనిని ఒకేసారి 15 బేసిస్ పాయింట్లు తగ్గించి 8.30 శాతానికి చేర్చింది. ఇక ఇప్పుడు సవరించిన తర్వాత తమ బ్యాంకులో తీసుకునే గృహ రుణాలపై వడ్డీ రేట్లు 8.30 శాతం నుంచి ప్రారంభం అవుతుందని తెలిపింది బ్యాంక్.
 
ఇదే సమయంలో ప్రాసెసింగ్ ఫీజు కూడా రద్దు చేస్తున్నట్లు తెలిసింది. అంటే జీరో ప్రాసెసింగ్ ఫీజు అన్నమాట. ఇది మార్చి 31 వరకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుందని స్పష్టం చేసింది.  ఇప్పటివరకు ప్రముఖ బ్యాంకుల్లో గృహ రుణాల జారీలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు వంటివి ముందువరుసలో ఉన్నాయి. వీటిల్లో వడ్డీ రేట్లు 8.40 శాతం నుంచి ప్రారంభం అవుతుండగా, ఇప్పుడు బ్యాంక్ ఆఫ్ ఇండియా మాత్రం అంతకంటే తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తోందని తెలిపింది.

తమ బ్యాంకులో 30 సంవత్సరాల కాలానికి లోన్ తీసుకుంటే మాత్రం రూ. లక్షపై రూ. 755 చొప్పున ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. రుణం ప్యాకేజీలో భాగంగా ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పిస్తున్నామని తెలిపింది. ఇక సంప్రదాయ గృహ రుణాలతో పాటుగానే రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్‌కు కూడా రుణాలు ఇస్తున్నట్లు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. 

 
ఇక్కడ కూడా ఎలాంటి ప్రాసెసింగ్ రుసుము వసూలు చేయట్లేదని, 7 శాతం వడ్డీకే ఈ రుణాలు అందిస్తున్నట్లు వివరించింది. గరిష్టంగా 120 నెలలకుగానూ ప్రాజెక్ట్ మొత్తం వ్యయంలో 95 శాతం ఋణంగా పొందొచ్చని తెలిపింది. మరోవైపు దీంట్లో ప్రభుత్వం నుంచి రూ. 78 వేలు సబ్సిడీ పొందొచ్చని చెప్పుకొచ్చింది.

భారతీయ స్టేట్ బ్యాంక్ ఇటీవల మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్లను (ఎంసీఎల్ఆర్) సవరించింది. ఇవి 2024 మార్చి 15 నుంచి అమల్లోకి వచ్చాయి. మరోవైపు బేస్ రేటు, బీపీఎల్ఆర్ కూడా సవరించింది. సవరించిన తర్వాత ఎంసీఎల్ఆర్ రేట్లు 8 శాతం నుంచి 8.85 శాతంగా ఉన్నాయి. ఎక్కువగా వినియోగదారుల రుణాలకు అనుసంధానమై ఉన్న ఏడాది టెన్యూర్ ఎంసీఎల్ఆర్‌ రేటు 8.65 శాతంగా ఉంది. బెంచ్‌మార్క్ ప్రైమ్ లెండింగ్ రేటును (బీపీఎల్ఆర్) 15 శాతంగా నిర్ణయించింది. ఎస్ బి ఐ బేస్ రేటు 10.25 శాతంగా ఉంది.