సుప్రీంకోర్టులో పిటీషన్ ఉపసంహరించుకున్న కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఈడీ తనను అక్రమంగా అరెస్టు చేసిందని కవిత సుప్రీంకోర్టులో సోమవారం రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే గతంలో ఈడీ సమన్లపై కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను మంగళవారం ఉపసంహరించుకున్నారు. ఈ కేసులో ఈడీ ఇప్పటికే కవితను అరెస్ట్  చేయడంతో రిట్ పిటిషన్‌పై విచారణ అవసరం లేకపోవడంతో దానిని వెనక్కి తీసుకుంటున్నట్లు కవిత తరపు న్యాయవాది విక్రమ్‌ చౌదరి వెల్లడించారు. 
 
పిటిషన్‌ ఉపసంహరణకు  జస్టిస్‌ బేలా త్రివేది, జస్టిస్‌ పంకజ్‌ మిట్టల్‌తో కూడిన బెంచ్ అనుమతించింది. ఈడీ సమన్లపై గత ఏడాది మార్చి 14న ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో  రిట్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే తాజాగా తన అరెస్టు అక్రమమంటూ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. 
 
కాగా.. ఇప్పటికే ఈడీ తీరుపై తాను వేసిన ఛాలెంజ్ పిటిషన్ విచారణలో ఉండగా మళ్లీ తనను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ కవిత తరపున ఆమె భర్త అనిల్ సుప్రీం కోర్టులో కంటెప్ట్ అఫిడవిట్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్‌ను కవిత ఉపసంహరించుకున్నారు.
 
మరోవైపు గతంలో ఈడీ విచారణను సవాల్ చేస్తూ కవిత సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా దానిపై విచారణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో భాగంగా.. కవితను రెండు మార్లు ఈడీ విచారింది. అయితే ఆ విచారణ రాత్రి వరకు కొనసాగటంతో కవిత ఈడీ వైఖరిని తప్పుబడుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహిళ అని కూడా చూడకుండా  రాత్రి వరకు విచారణ చేస్తున్నట్టు ఈడీపై ఆరోపణలు చేశారు. 
 
ఆ తర్వాత కూడా విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇవ్వగా, సుప్రీం కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు వచ్చేవరకు తాను విచారణకు హాజరుకానని తేల్చిచెప్పారు.  ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన, అమల్లో అవకతవకలు జరిగాయని ఈడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో ఆప్ నేతలతో పాటు ఎమ్మెల్సీ కవితకు పలుమార్లు సమన్లు ఇచ్చి విచారించింది. 

ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 15న హైదరాబాద్ లోని కవిత ఇంట్లో ఈడీ సోదాలు నిర్వహించిన అనంతరం  అరెస్టు చేసి దిల్లీకి తరలించారు. దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో కవితను ప్రవేశపెట్టారు. కోర్టు ఆమెకు మార్చి 23 వరకు ఈడీ కస్టడీ విధించింది. ఈడీ కస్టడీలో ఉన్న కవితను అధికారులు విచారిస్తున్నారు. ఈ కేసుపై ఈడీ ఇప్పటికే కీలక ప్రకటన చేసింది. దిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎమ్మెల్సీ కవితదే కీలక పాత్ర అని తెలిపింది. కవిత ఆప్ నేతలకు రూ.100 కోట్లు ఇచ్చారని తెలిపింది. ఈ కేసులో ఇప్పటి వరకూ 15 మందిని అరెస్టు చేసినట్లు ఈడీ తెలిపింది.