
తెలంగాణ గవర్నర్‌గా ఝార్ఖండ్ గవర్నర్ సీపీ.రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. తమిళిసై గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఆ బాధ్యతలను రాధాకృష్ణన్‌కు అప్పగించినట్లు రాష్ట్రపతి భవన్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. తెలంగాణ గవర్నర్ తమిళిసై రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు.
పుదుచ్చెరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా రాధాకృష్ణన్‌కు అదనపు బాధ్యతలను అప్పగించారు. పూర్తి స్థాయి గవర్నర్లను నియమించే వరకు తెలంగాణ, పుదుచ్చెరి బాధ్యతలను నిర్వర్తించాలని రాధాకృష్ణన్‌ను కోరుతూ రాష్ట్రపతి భవన్ ఓ లేఖ రిలీజ్ చేసింది. బాధ్యతలు స్వీకరించిన క్షణం నుంచి నియామకం అమలులోకి వస్తుందని రాష్ట్రపతి భవన్ ఆ ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాకు గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించడంపై కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
రానున్న లోక్ సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్థిగా పోటీచేసేందుకై డా. సౌందరాజన్ సోమవారం గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఈ నియామకం చేపట్టాల్సి వచ్చింది. తమిళనాడుకు చెందిన సీపీ రాధాకృష్ణన్ బీజేపీలో క్రియాశీలకంగా పని చేశారు. ఆయన రెండుసార్లు కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గం నుంచి 1998, 1999లో ఎంపీగా ఎన్నికయ్యారు.
తమిళనాడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలదించారు. 2004, 2014, 2019 సాధారణ ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం 2023 ఫిబ్రవరి 12న జార్ఖండ్ గవర్నర్‌గా నియమితుడయ్యాడు.
More Stories
బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అరెస్ట్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం
బంగారు లక్ష్మణ్ కు ఘనంగా నివాళులు