బెంగాల్ డీజీపీ సహా 6 రాష్ట్రాల హోం కార్యదర్శులపై వేటు

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సంచలన నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికలను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తామని చెప్పిన ఈసీ అందుకు తగ్గట్టుగానే క్షేత్రస్దాయిలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఇందులో భాగంగానే ఆరు రాష్ట్రాల హోంశాఖ కార్యదర్శుల్ని తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుుకుంది. 
 
అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీని సైతం తప్పించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి ఆరు రాష్ట్రాల్లో హోంశాఖ కార్యదర్శులను తొలగిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. వీరితో పాటు మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌లోని సాధారణ పరిపాలనా విభాగం కార్యదర్శిని కూడా తొలగించారు. అలాగే పశ్చిమ బెంగాల్ డీజీపీని కూడా తొలగించేలా ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
వీరితో పాటు బృహన్ ముంబై మున్సిపల్ కమిషనర్ ఇక్బాల్ సింగ్ చాహల్, అదనపు కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లను కూడా ఈసీ తప్పించింది. సిఎం కార్యాలయంలో బాధ్యతలు నిర్వహిస్తున్న జిఎడి మిజోరం, హిమాచల్ ప్రదేశ్‌ల కార్యదర్శిలను కూడా ఈసీఐ తొలగించినట్లు తెలుస్తోంది.
లోక్ సభ ఎన్నికలకు నెల రోజుల కంటే తక్కువ సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈసీ చేపట్టిన ఈ బదిలీలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఎన్నికలు నిష్పాక్షికంగా నిర్వహించేందుకు వీలుగా ఈసీ ఈ బదిలీలు చేపట్టినట్లు చెబుతున్నారు. లోక్ సభ ఎన్నికలకు ఇప్పటికే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 19న తొలిదశ పోలింగ్ ప్రారంభం కానుంది. జూన్ 1 వరకూ ఏడు దశల్లో పోలింగ్ కొనసాగనుంది. జూన్ 4న ఫలితాలు ప్రకటిస్తారు.