మహారాష్ట్రలో నలుగురు మావోయిస్ట్ అగ్రనేతలు హతం

మహారాష్ట్రలో మ‌హారాష్ట్ర‌లోని గ‌డ్చిరౌలి జిల్లాలో ఇవాళ తెల్ల‌వారుజామున జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్‌లో న‌లుగురు సీనియ‌ర్ న‌క్స‌ల్స్ మృతిచెందారు. ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని గడ్చిరోలిలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో మావోయిస్ట్ అగ్రనేతలు హతమైనట్టు అధికారులు తెలిపారు. ఆ న‌లుగురిపై రూ.36 లక్షల రివార్డు ఉందని చెప్పారు. 
 
తెలంగాణ సరిహద్దుల నుంచి ప్రాణహిత నదిని దాటి కొంతమంది నక్సల్స్ ప్రవేశించినట్టు సోమవారం మధ్యాహ్నం పోలీసులకు నిఘా వర్గాల ద్వారా సమాచారం అందింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో పలుచోట్ల దాడులకు వ్యూహరచన కోసం తెలంగాణ నుంచి గడ్చిరోలిలోకి ప్రవేశించినట్టు జిల్లా ఎస్పీ నీలోత్పల్ చెప్పారు.
 
నిఘా వర్గాల సమాచారం ఆధారంగా గ‌డ్చిరౌలి పోలీసు విభాగానికి చెందిన సీ-60 ప్ర‌త్యేక పోరాట దళాలు కూంబింగ్ ఆప‌రేష‌న్ నిర్వ‌హించాయి. సీ-60తో పాటు సీఆర్పీఎప్ క్విక్ యాక్ష‌న్ బృందం కూడా సెర్చ్ ఆప‌రేష‌న్‌లో పాల్గొన్నాయి. మంగ‌ళ‌వారం ఉద‌యం రేప‌న్‌ప‌ల్లి స‌మీపంలో ఉన్న కోల‌మ‌ర్క ప‌ర్వ‌తాల్లో సీ-50 యూనిట్ బృందాలు కూంబింగ్ నిర్వ‌హించాయి. ఆ స‌మ‌యంలో న‌క్స‌లైట్లు విచ‌క్ష‌ణార‌హితంగా పోలీసుల‌పై కాల్పులు జ‌రిపారు. అయితే భ‌ద్ర‌తా బ‌ల‌గాలు ఆ దాడుల్ని త‌ప్పికొట్టాయ‌ని ఓ అధికారి చెప్పారు.
 
కాల్పులు ఆగిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో శోధించగా నలుగురు నక్సలైట్ల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనాస్థలిలో ఒక ఏకే-47 రైఫిల్, ఒక కార్బైన్, రెండు కంట్రీ మేడ్ పిస్టల్స్, నక్సల్ సాహిత్యం, ఇతర వస్తువులు కూడా స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. హతమైన నక్సల్స్‌ను ఇద్దరు దళ కార్యదర్శలు వర్గీశ్, మగ్తూ.. సభ్యులు కుర్సుంగ్ రాజు, కుడిమెట్ట వెంకటేశ్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు.