దొంగ ఓట్లు వేయించుకొనేందుకు వైసిపి కుట్ర

రాబోయే ఎన్నికల్లో దొంగ‌ ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ కుట్ర పన్నుతోందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆరోపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనకు ప్రతి ఒక్కరూ బీజేపీ పట్ల ఆకర్షితులవుతున్నారని ఆమె చెప్పారు. ఇతర పార్టీలో సమర్ధవంతంగా పనిచేసిన వారు తమ పార్టీకి ఆకర్షితులై చేరుతున్నారని పేర్కొన్నారు. 
 
ఏపీలో వైసీపీ పాలనలో అవినీతి బాగా పెరిగిపోయిందని, రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతుందని చెబుతూ మూడు ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టి సీఎం జగన్‌రెడ్డి పాలిస్తున్నారని ఆమె మండిపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో  ఇక ఎన్నికలకు అడుగుపెట్టినట్లేనని పేర్కొంటూ జగన్ దుష్టపాలనకు చరమగీతం పాడాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిపై ఉందని పురందేశ్వరి పిలుపిచ్చారు.

దొంగ‌ ఓట్లు వేయించుకోవడానికి వైసీపీ సమయాత్తం అవుతుందని ఆమె హెచ్చరించారు. వై నాట్ 175 అంటే దొంగ ఓట్లతో గెలుద్దామనే జగన్ ధీమాగా ఉన్నారని అనే చెప్పారు. డీఎస్సీ పరీక్షలో పది లక్షల మంది ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండాలనే ఎన్నికల సమయంలో పరీక్షలు పెట్టారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రంలో నిరుద్యోగ‌ సంఖ్య పెంచింది జగనే అని ఆమె ధ్వజమెత్తారు. దుష్ట ఆ

లోచన కలిగిన ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బిజెపి నేత పిలుపునిచ్చారు. రోడ్లన్నీ గతుకుల మయం అయ్యాయని, రోడ్లు అధ్వాన్నంగా‌ ఉన్నాయని ఆమె పేర్కొన్నారు. బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తును ప్రజలంతా ఆశీర్వదించాలని పురందేశ్వరి కోరారు. తమ అభ్యర్థులకు సంబంధించి అధిష్ఠానం త్వరలోనే ప్రకటిస్తుందని చెబుతూ ఆదివారం రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించబోతున్నారని ఆమె తెలిపారు.

ఇలా ఉండగా, వైసీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు బీజేపీలో చేరారు. ఆయా నేతలకు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ థావడే కాషాయం కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. బీజేపీలో చేరిన వారిలో రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి, తణుకు మాజీ మున్సిపల్ చైర్మన్ ముళ్లపూడి రేణుక, డాక్టర్ హరిశ్చంద్ర ప్రసాద్ దంపతులు ఉన్నారు. 

ఎన్టీఆర్ జిల్లా కాకాని వెంకటరత్నం నాయుడు మనవడు తరుణ్ కాకాని. కాకినాడకు చెందిన కాంగ్రెస్ నాయకులు సబ్బిళ్ల గంగిరెడ్డి ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా సిరి పురపు తేజేశ్వర్‌రావు, వైసీపీ చెందిన పైడి రాజారావు, వైసీపీ మండల అధ్యక్షుడు పోలేపల్లి ప్రసాద్ బీజేపీలో చేరారు.