ఏపీలో ఇప్పటి వరకు రూ.164 కోట్లు జప్తు

ఎన్నికల షెడ్యూల్‌ వెలువడక ముందే ఏపీలో చెక్‌పోస్టుల ద్వారా ఇప్పటి వరకు రూ.164 కోట్లు సీజ్‌ చేశామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ఆయా ప్రాంతాల్లో నగదు, మద్యం, డ్రగ్స్, వస్తువులు సీజ్ చేశామని వివరించారు. ఉచితాలు, నగదు తరలింపు కోసం అన్ని కేంద్ర, రాష్ట్ర ఏజెన్సీల తో నిఘా పెట్టామని వెల్లడించారు.

ఫ్లయింగ్ స్క్వాడ్ లు కూడా ఏర్పాటు చేశామని శనివారం మీడియాకు వివరించారు. బందోబస్తు కోసం 1,14,950 మంది సివిల్ పోలీసులు, 58 కంపెనీల పారామిలటరీ బలగాలు ,465 కంపెనీల సాయుధ బలగాలు అవసరం అవుతాయని స్పష్టం చేశారు. 

బందోబస్తు కోసం 2,18,515 మంది పోలీసు సిబ్బంది అవసరం అవుతారని పోలీసు ఎన్నికల నోడల్ అధికారి శంకబ్రత బాగ్చి తెలిపారు. రాష్ట్ర పోలీసులు, ఇతర రాష్ట్రాలకు చెందిన పోలీసులు, కేంద్ర బలగాలు, ఎక్స్ సర్వీస్ మెన్ ను కూడా నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏపీలో 121 చెక్ పోస్టులు ఏర్పాటు చేశామని, ఈ సంఖ్యను మరింత పెంచవచ్చని పేర్కొన్నారు.