ఏపీలో మే 13న ఎన్నికల పోలింగ్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్-2024ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ప్రకటించింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.  మే 13న పోలింగ్ జరగనుంది.   ఏప్రిల్ 18న అధికారిక నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 15 చివరి తేదీగా నిర్ణయించారు. 26 ఏప్రిల్ న నామినేషన్ల స్క్రూనిటీ జరగనుంది. అభ్యర్థుల ఉపసంహరణకు గడువు ఏప్రిల్ 29గా ప్రకటించింది.

రాష్ట్రంలోని 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. రాష్ట్రంలో మొత్తం 4.07 కోట్ల ఓటర్లు ఉండగా, వీరిలో 2 కోట్ల మంది పురుషులు, 2.07 కోట్ల మంది మహిళా ఓటర్లు, 3,482 మంది థర్డ్ జెండర్‌ ఓటర్లు ఉన్నారు. 67,434 మంది సర్వీస్ ఓటర్లు, 7,603 మంది ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు ఉన్నారు.

రాష్ట్రంలో మొత్తం 46,165 పోలింగ్ కేంద్రాలు ఉండగా, సగటున ఒక్కో పోలింగ్ స్టేషన్‌కు 887 ఓటర్లు ఉన్నారని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.  లోక్‌సభ , అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరుగనున్నాయి. రాష్ట్రంలో మొత్తం 29 ఎస్సీ, 7 ఎస్టీ రిజర్వ్‌డ్‌ అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 4 ఎస్సీ, ఒక ఎస్టీ రిజర్వ్‌డ్‌ లోక్‌సభ స్థానాలు ఉన్నాయని వెల్లడించింది.

పోలింగ్ కు సరిగ్గా 57 రోజుల సమయం ఉంది. గత ఎన్నికల కంటే ఈ సారి దాదాపు నెల రోజులు ఆలస్యంగా పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 25వ తేదీ వరకు నామినేషన్లకు గడువు నిర్ణయించారు. మే 13న పోలింగ్ జరగనుంది. మే 11న ప్రచారం ముగియనుంది. అంటే ఖచ్చితంగా 55 రోజుల సమయం ఉంది. సుమారు రెండు నెలల వ్యవధి ఉండడంతో అభ్యర్దులు ప్రచారం ఖర్చు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

అటు టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఎన్నికల బరిలోకి దిగుతోంది. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్, కేంద్ర మంత్రులు కూటమి తరపున ప్రచారానికి సిద్దమయ్యారు. కూటమి మధ్య సీట్ల సర్దుబాటు ఆలస్యం అయింది. తొలి రెండు విడతల్లో పోలింగ్ జరిగి ఉంటే ప్రచారానికి సమయం సమస్యగా మారేది. అయితే, ఇప్పుడు 55 రోజుల సమయం రావటం కూటమికి కొంత మేర కలిసొచ్చే అంశంగా కనిపిస్తోంది.
 
ఆంధ్రప్రదేశ్ లో గత అసెంబ్లీ ఎన్నికలు 2019లో జరిగాయి. వైసీపీ ఘన విజయం సాధించగా టీడీపీ ప్రతిపక్షానికి పరిమితమైంది. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన సీఎం జగన్ ఐదేళ్లు పదవిలో ఉన్నారు. దీంతో మరోసారి ఎన్నికల్లో గెలిచి రెండో సారి అధికారం చేపట్టేందుకు వైసీపీ ప్రయత్నాలు చేస్తుండగా.. టీడీపీ జనసేన బీజేపీలతో కూడిన కూటమి గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఫలితంగా ఈ ఏడాది జరిగే ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు వాడీ వేడీగా సాగనున్నాయి.