బీజేపీలో చేరిన గాయని అనురాధ పౌడ్వాల్‌

ప్రముఖ గాయని అనురాధ పౌడ్వాల్‌ శనివారం బీజేపీ పార్టీలో చేరారు. న్యూఢిల్లీ నుంచి ఆ పార్టీ సభ్యత్వం స్వీకరించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మీడియా చీఫ్ అనిల్ బాలున్, రాజస్థాన్ ఇన్‌చార్జి అరుణ్ సింగ్ సమక్షంలో అనురాధ బీజేపీలో చేరారు. అనురాధ పౌడ్వాల్‌ బాలీవుడ్‌లో ఎన్నో హిట్‌ చిత్రాలను ఆలపించారు. మరాఠీతోపాటు హిందీ, తమిళం, ఒడియా, నేపాలీ భాషల్లో పాటలు పాడారు. సినిమా పాటలతో పాటు భజనలు, భక్తిగీతాలు ఆలపించి ఎంతో గుర్తింపు పొందారు.

బీజేపీలో చేరడంపై ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సనాతనంతో బలమైన అనుబంధం ఉన్న పార్టీలో చేరడం తన అదృష్టమన్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా అని ప్రశ్నించగా.. తనకు తెలియదన్నారు. కర్నాటకలోని కార్వార్‌లో జన్మించిన పౌడ్వాల్ 19 ఏళ్ల వయసులో ‘అభిమాన్’ చిత్రంలో ‘ఓంకారం బిందు సంయుక్తం’తో సింగర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. ఈ పాటను ఆర్‌డీ బర్మన్ స్వరపరిచారు. అనురాధ పౌడ్వాల్ 1983లో ‘హీరో’ చిత్రంలో ‘తు మేరా హీరో హై’తో పాటతో బాలీవుడ్‌లో తనదైన ముద్ర వేసింది.

అలాగే ‘ఆషికీ’, ‘దిల్ హై కి మంత నహిన్’, ‘బేటా’ చిత్రాల్లో ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. అనురాధ పౌడ్వాల్ ఐదు దశాబ్దాలకుపై సింగర్‌గా కొనసాగుతున్నారు. గుజరాతీ, హిందీ, కన్నడ, మరాఠీ, సంస్కృతం, బెంగాలీ, తమిళం, తెలుగు, ఒరియా, అస్సామీ, పంబాజీ, భోజ్‌పురి, నేపాలీ, మైథిలీ తదితర భాషల్లో 9వేలకుపైగా పాటలు ఆపాడారు. 1,500 కంటే ఎక్కువ శ్లోకాలను రికార్డు చేశారు. అయితే, పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది.