వివేకా హత్యకేసులో చెల్లులు సునీత పోరుకు అండగా షర్మిల!

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయంకోసం, నిందితులకు శిక్ష పడేటట్లు చేయడం కోసం చెల్లెలు, ఆయన కుమార్తె డా. సునీతా రెడ్డి జరుపుతున్న పోరాటానికి అండగా ఉంటానని ఎపిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. వివేకానందరెడ్డి 5వ వర్ధంతి సందర్భంగా కడపలో శుక్రవారం జరిగిన సంస్మరణసభలో మాట్లాడుతూ అన్నా అని పిలిపించుకున్నవారే హంతకులకు రక్షణ కల్పిస్తున్నారని అంటూ తన అన్న, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
 
హంతకులు ఎవరో కాదు బంధువులేనని సాక్ష్యాలు చెప్తున్నాయని స్పష్టం చేస్తూ బాధితులకు అండగా భరోసా ఇవ్వకుండా వారిపైనే ఆరోపణలు చేస్తు్న్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలంతా ఒక నిర్ణయం తీసుకోవాలని, హత్యా రాజకీయాలను చీ కొట్టాలని, వివేకా హంతకుల పక్షాన నిలబడ్డ వారికి గుణపాఠం నేర్పాలని, నిజం గెలవాలని ఆమె పిలుపిచ్చారు.

ఈ సందర్భంగా పులివెందులలోని వివేకా ఘాట్‌ వద్ద ఆయన కుమార్తె వైఎస్ సునీతా రెడ్, ఆమె భర్త రాజశేఖరరెడ్డి, కుటుంభం సభ్యులతో కలిసి ఉదయం నివాళులర్పించారు. కడపలో జరిగిన వర్ధంతి సభలో షర్మిల మాట్లాడుతూ ఐదేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ హత్య చేసిన వాళ్లకు శిక్ష పడలేదని  విమర్శించారు. 
 
జగనన్న అద్దం ముందు నిల్చుని ప్రశ్నించుకోండి, మనస్సాక్షి ఏం చెప్తుందో వినండి అంటూ ఆమె హితవు చెప్పారు. వైఎస్ఆర్ తన తోబుట్టువుల కోసం ఎంతో చేశారన్న షర్మిల ఆయన వారసుడిగా మీరేం చేశారంటూ జగన్ ను ప్రశ్నించారు. తమ పోరాటం అధికారం కోసం, ఆస్తి కోసం కాదన్న షర్మిల న్యాయం కోసమంటూ ఆమె తెలిపారు.
 
“సునీతను చూసిన ప్రతిసారి నా గుండెల్లో బాధ, ఉద్రేకం. న్యాయం జరగలేదనే కోపం. చిన్నాన్న ఆత్మకు శాంతి కలగలేదనే ఆవేదన. అందుకే సునీతకు, చిన్మమ్మకు మాటిస్తున్నా. మీ పక్కన ఎవరు నిలబడినా, నిలబడకపోయినా వైఎస్ఆర్ బిడ్డ మీకు అండగా ఉంటుంది. సునీత చేస్తున్న ధర్మపోరాటంలో నేను సునీతకు బలమౌతా, ఆయుధమౌతా. పుట్టిన గడ్డ సాక్షిగా చెప్తున్నా. ఎవరు నిలబడినా, నిలబడకపోయినా సునీతకు అండగా ఉంటా. వివేకాను హత్యచేసిన వారికి శిక్షపడాలని సునీత చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలుస్తా” అని షర్మిల భరోసా ఇచ్చారు.

“ఇది రాజకీయాల కోసమో, వారసత్వం కోసమో, ఆస్తి కోసమో, అధికారం కోసమో చేస్తున్న పోరాటం కాదు. ఈ సమరం చేస్తున్నది న్యాయం కోసం. తండ్రి చావు విషయంలో న్యాయం కోరుతున్న బిడ్డ కోసం, భర్తను రాతి క్రూరంగా కోల్పోయి విధవరాలిగా మారిన ఓ భార్య కోసం. చిన్నాన్న ఆత్మ శాంతి కోసం” అని షర్మిల ఉద్వేగంతో కోరారు.