18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్రం నిషేధం

18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లపై కేంద్రం నిషేధం

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. అశ్లీలమైన, అసభ్యకరమైన కంటెంట్‌ను ప్రచురించే 18 ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్‌ చేసింది. దేశంలో పబ్లిక్‌ యాక్సెస్‌ ఉన్న 19 వెబ్‌సైట్‌లు, 10 యాప్‌లు, ఈ ప్లాట్‌ఫామ్స్‌కు అనుసంధానంగా ఉన్న 57 సోషల్‌ మీడియా ఖాతాలు నిలిపివేసింది. 

ఈ మేరకు గురువారం కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ ఓ ప్రకటనను విడుదల చేసింది. గతంలోనే అశ్లీల కంటెంట్‌ని తొలగించాలని ఆయా ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు కేంద్రం పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. అయినప్పటికీ ఆ ఫ్లాట్‌ఫామ్స్‌ కేంద్రం హెచ్చరికలను పట్టించుకోలేదు. 

దీంతో కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆదేశాల మేరకు 18 ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్‌ను నిలిపివేసినట్లు మంత్రిత్వ శాఖ తన ప్రకటనలో తెలిపింది.  సృజనాత్మక వ్యక్తీకరణ పేరిట అశ్లీల, అసభ్య, నీచమైన కంటెంట్‌ను ప్రచురించకుండా చూడవలసిన బాధ్యత ఈ ప్టాల్‌ఫారాల పైన ఉందని మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ గతంలో అనేక సార్లు పిలుపునిచ్చారు.

ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ చట్టం 2000లోని నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వశాఖ ప్రకటన పేర్కొంది. ఈ ఓటీటీలతోపాటు వాటికి సంబంధించిన 19 వెబ్ సైట్లు, 10 యాప్స్, 57 సోషల్ మీడియా హ్యాండిల్స్ ను కూడా నిషేధించింది.  ఇలా 18 ఓటీటీలపై నిషేధం విధించగా ఇందులో ఒక ఓటీటీకి ఇప్పటికే కోటికిపైగా డౌన్ లోడ్స్ ఉన్నట్లు గుర్తించారు. మరో రెండు ఓటీటీలు 50 లక్షలకుపైగా డౌన్ లోడ్స్ తో ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇక ఈ ఓటీటీల సోషల్ మీడియా  హ్యాండిల్స్ కు మొత్తంగా 32 లక్షల మంది యూజర్లు ఉన్నారు.

 ఈ 18 ఓటీటీలూ తమ సోషల్ మీడియా హ్యాండిల్స్ లో అశ్లీల ట్రైలర్లు, సీన్ల ద్వారా ప్రేక్షకులను ఆకర్షించే ప్రయత్నం చేసినట్లు కేంద్ర సమాచార శాఖ వెల్లడించింది. కేంద్రం నిషేధం విధించిన ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో డ్రీమ్స్‌ ఫిల్మ్స్‌, అన్‌కట్‌ అడ్డా, వూవీ, యేస్మా, ట్రై ఫ్లిక్స్‌, ఎక్స్‌ ప్రైమ్‌, నియోన్‌ ఎక్స్‌ వీఐపీ, బేషరమ్స్‌, హంటర్స్‌, రాబిట్‌, ఎక్స్‌ట్రా మూడ్‌, మూడ్‌ఎక్స్‌, మోజ్‌ఫ్లిక్స్‌, హాట్‌ షార్ట్స్‌ వీఐపీ, ఫ్యూజీ, ప్రైమ్‌ ప్లే తదితర ఓటీటీలు ఉన్నాయి.

“ఈ ప్లాట్‌ఫామ్స్ పై ఉన్న కంటెంట్ లో చాలా వరకూ అశ్లీలమైనదే. మహిళలను కించపరిచే విధంగా ఇవి ఉన్నాయి. ఈ కంటెంట్ లైంగిక చర్యలను చాలా తప్పుడు విధానంలో చూపించాయి. టీచర్లు, విద్యార్థుల మధ్య లైంగిక సంబంధాలు, కుటుంబాల్లో అక్రమ సంబంధాలు వంటివి ఇందులో ఉన్నట్లు గుర్తించాం. అందుకే వీటిపై నిషేధం విధిస్తున్నాం” అని సమాచార శాఖ తెలిపింది.