హైదరాబాద్ లో రూ.1000 కోట్ల జీఎస్టీ కుంభకోణం

జీఎస్టీ రిఫండ్స్‌, ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ (ఐటీసీ) కేసుల్లో సుమారు రూ.1000 కోట్ల కుంభకోణం జరిగినట్లు వాణిజ్య పన్నుల శాఖ గుర్తించింది. ఇంతకన్నా ఎక్కువ మొత్తంలో మోసం జరిగి ఉంటుందని, ఇది పూర్తిస్థాయి దర్యాప్తులో బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
 
దాదాపు డజన్‌ వరకూ కంపెనీలు మోసపూరిత రిఫండ్‌లకు పాల్పడినట్టు తేలగా, జంటనగరాల్లోని మరో 51 కంపెనీల్లో ఐటీసీ మోసాలకు సంబంధించిన దర్యాప్తు వివిధ దశల్లో ఉన్నట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. విచారణలో ఉన్న ఈ 51 కేసులకు సంబంధించి మొత్తం టర్నోవర్‌ రూ.5,893 కోట్లు కాగా, ఇందులో ప్రభుత్వానికి రావాల్సిన పన్ను రూ.976 కోట్లు, అన్నీ కలిపుకొని సుమారు రూ.1000 కోట్ల వరకు కుంభకోణం జరిగినట్టు భావిస్తున్నారు. 
 
కొన్ని కంపెనీలు అంతర్రాష్ట్ర లావాదేవీలకు సంబంధించి జీఎస్టీఆర్‌-1 రూపంలో నెలవారీ రిటర్న్స్‌ ఫైల్‌చేస్తూ ఇతర రాష్ర్టాల్లో పన్ను చెల్లింపుదారులకు ఐటీసీని బదిలీ చేస్తున్నారని అధికారులు తెలిపారు. అలాగే, పలు కంపెనీలు లోకల్‌ సేల్స్‌తోపాటు అంతర్రాష్ట్ర సేల్స్‌లో మోసపూరితంగా జీరో టర్నోవర్‌ కింద జీఎస్టీఆర్‌-3బీ ఫైల్‌ చేస్తూ పన్నులు ఎగ్గొడుతున్నాయని చెప్పారు. 
 
మరికొన్ని కంపెనీలు పన్ను చెల్లించకుండానే ఇతర పన్ను చెల్లింపుదారులకు ఐటీసీని బదిలీచేస్తున్నాయని, దీనివల్ల ఖజానాకు భారీగా నష్టం వాటిల్లుతున్నదని తెలిపారు. పన్ను చెల్లించకుండా ఇతరులకు ఇన్‌పుట్‌ క్రెడిట్‌ ైక్లెమ్‌లకు వీలు కల్పించారని, వాస్తవంగా చెల్లించాల్సిన పన్నును తగ్గించి చూపారని, దీనివల్ల రెండు విధాలుగా ఖజానాకు నష్టం జరిగిందని అధికారవర్గాలు వెల్లడించాయి.
 
వాణిజ్య పన్నుల శాఖకు ఐటీ సహకారం అందిస్తున్న ఐఐటీ- హైదరాబాద్‌ పాత్ర కూడా ఇందులో ఉన్నట్టు అధికారవర్గాలు పేర్కొన్నాయి. మొత్తం డాటాను ఐఐటీహెచ్‌ నిర్వహిస్తున్నదని, అయినా వారు ఇటువంటి మోసపూరిత వ్యవహారాలను తమ దృష్టికి తేలేదని అధికారులు పేర్కొంటున్నారు. ఐఐటీహెచ్‌ పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. 
 
ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతున్నదని వాణిజ్యపన్నుల శాఖ కమిషనర్‌ టీకే శ్రీదేవి తెలిపారు. మరోవైపు, జీఎస్టీ పన్నుల కుంభకోణంలో ఐఐటీహెచ్‌ పాత్ర ఉన్నట్లు వచ్చిన వార్తలపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కేంద్ర విద్యాశాఖ మంత్రికి లేఖ రాశారు.