
* ఎమ్మెల్యే పదవికీ మనోహల్ లాల్ ఖట్టర్ రాజీనామా
హర్యానా సీఎం నాయాబ్ సింగ్ సైనీ హర్యానా రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బలపరీక్షలో నెగ్గారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఆమోదించారు. మనోహర్ లాల్ ఖట్టర్ రాజీనామాతో అనూహ్య రీతిలో సైనీ మంగళవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. వెంటనే బుధవారం ప్రత్యేకంగా సమావేశమైన అసెంబ్లీలో ఆయన బలపరీక్ష ఎదుర్కొన్నారు.
జేజేపీ వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కొందరు అసెంబ్లీ పరిసరాల్లో కనిపించారు. బుధవారంనాడు సైనీ విశ్వాస పరీక్ష సందర్భంగా ఓటింగ్‌కు దూరంగా ఉండాలని జననాయక్ జనతా పార్టీ (జేజేపీ) అధినేత దుష్యంత్ చౌతాలా తమ పార్టీకి చెందిన 10 మంది ఎమ్మెల్యేలకు విప్ జారీ చేశారు. అయితే విప్ జారీ చేసినప్పటికీ జేజేపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు జోగి రామ్ సిహాగ్, ఐశ్వర్ సింగ్, రామ్‌కుమార్ గౌతమ్, దేవేంద్ర బబ్లి రాష్ట్ర అసెంబ్లీకి వచ్చారు. అయితే విశ్వాస పరీక్ష మొదలైన తర్వాత ఆ ఎమ్మెల్యేలు సభ నుంచి వెళ్లిపోయారు.
ప్రతిపక్ష నేత భూపిందర్ హూడా, కాంగ్రెస్ ఎమ్మెల్యే బీబీ బద్రాలు సభను గంట పాటు వాయిదా వేయాలని కోరారు. రాష్ట్రంలో అస్థిరత్వం ఉందని, రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే రఘువీర్ కడియన్ కోరారు. విశ్వాస పరీక్షపై రహస్య బ్యాలెట్ కావాలని ఆయన డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేసిన మనోహర్ లాల్ ఖట్టర్ తాజాగా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారు. ఆయన కర్నాల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ముఖ్యమంత్రి సైనీ ఆరు నెలలలోగా అసెంబ్లీకి ఎన్నిక కావలసి ఉండడంతో ఆయన ఇక్కడి నుండి జరిగే ఉపఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉంది.
కాగా, తాను బీజేపీలోనే ఉన్నానని హర్యానాకు చెందిన సీనియర్ బీజేపీ నాయకుడు, మాజీ హోంమంత్రిఅనిల్ విజ్ స్పష్టం చేశారు. బీజేపీ భక్తుడినన్న ఆయన, పార్టీ కోసం పని చేస్తానని చెప్పారు. హర్యానా సీఎం మార్పు నేపథ్యంలో ఆ పదవి ఆశించిన అనిల్ విజ్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. కొత్త సీఎంగా నయాబ్ సైనీని ఎన్నుకోవడంతో బీజేపీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారు. కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారంకు కూడా హాజరు కాలేదు.
More Stories
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం
12-13 తేదీల్లో మోదీ అమెరికా పర్యటన
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి