రేపటిలోగా ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించాలి

ఎన్నికల బాండ్ల వ్యవహారంలో స్టేట్‌ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)కు సుప్రీంకోర్టు షాకిచ్చింది. మార్చి 12 కల్లా వివరాలు సమర్పించాల్సిందేనని స్పష్టం చేసింది. మార్చి 15 కల్లా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్‌లో ఉంచాలని ఆదేశింంచిన సుప్రీంకోర్టు.. ఎస్బిఐ పిటిషన్ డిస్మిస్ చేసింది. ఎన్నికల బాండ్ల వివరాల సమర్పణకు గడువు పొడిగించాలన్న ఎస్బీఐ పిటిషన్‌పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. 
 
ఈ సందర్భంగా స్టేట్ బ్యాంకు తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గత 26 రోజులుగా ఏం చేశారంటూ మండిపడింది.  ఎన్నికల బాండ్ల వివరాలను వెల్లడి చేయడానికి గడువును జూన్‌ 30 వరకూ పొడిగించాలంటూ ఎస్‌బీఐ దాఖలు చేసింది. రాజకీయ పార్టీలకు రహస్యంగా నిధులు అందించడానికి వీలు కల్పించే ఎన్నికల బాండ్ల పథకాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. 
 
పార్టీలకు అందిన విరాళాలు, దాతల వివరాలను మార్చి 6లోగా ఎన్నికల సంఘానికి అందించాలని ఎస్బీఐని ధర్మాసనం ఆదేశించింది. ఆ సమాచారాన్ని మార్చి 13లోగా బహిర్గతం చేయాలని ఈసీకి స్పష్టం చేసింది. ఈ క్రమంలో మరింత గడువు కావాలంటూ ఎస్‌బీఐ సుప్రీంకోర్టు ఆశ్రయించింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం సోమవారం విచారణ జరిపింది.
 
ఎస్బీఐ ఇచ్చిన సంకేతాల మేర‌కు బ్యాంకు వ‌ద్ద కావాల్సినంత స‌మాచారం ఉంద‌ని అర్థ‌మ‌వుతోంద‌ని కోర్టు తెలిపింది. జూన్ 30వ తేదీ వ‌ర‌కు పొడిగింపు ఇవ్వాల‌ని పెట్టుకున్న పిటీష‌న్‌ను కొట్టివేస్తున్న‌ట్లు సుప్రీంకోర్టు చెప్పింది. మార్చి 12 లోగా ఎల‌క్టోర‌ల్ బాండ్ల వివ‌రాల‌ను వెల్ల‌డించాల‌ని ఎస్బీఐని కోర్టు ఆదేశించింది. ఈ నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘానికి కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. మార్చి 15వ తేదీన సాయంత్రం 5 గంట‌ల లోగా ఈసీ త‌మ వెబ్‌సైట్‌లో ఆ బాండ్ల వివ‌రాల‌ను పొందుప‌రుచాల‌ని కోర్టు ఆదేశించింది.
 
‘గత నెల ఇచ్చిన తీర్పు ప్రకారం విరాళాల వివరాలు వెల్లడించాలని మేం ఆదేశించాం. మీరు ఇలా అదనపు సమయం కోరుతూ మా దగ్గరకు రావడం చాలా తీవ్రమైన విషయం. మా తీర్పు స్పష్టంగా ఉంది. గత 26 రోజులుగా మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారు. మీ దరఖాస్తులో ఆ విషయాలు ఏవీ లేవు’ అని ధర్మాసనం అడిగింది. ఎస్‌బీఐ వెంటనే ఆ వివరాలను ఎన్నికల సంఘానికి ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది.
 
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే వాదనలు విన్పిస్తూ “మాకు కొంత సమయం కావాలి. ధర్మాసనం ఆదేశాలకు అనుగుణంగా కొత్తగా బాండ్లను జారీ చేయడాన్ని నిలిపేశాం. బాండ్లు కొనుగోలు చేసిన వారి వివరాలు కోర్ బ్యాంకింగ్ సిస్టంలో నమోదు కాలేదు. బాండ్ల కొనుగోలుదారుల వివరాలు రహస్యంగా ఉంచాలని నిబంధనల్లో ఉంది” అని తెలిపారు. 
 
“మా వద్ద అందరి వివరాలూ ఉన్నాయి. అలాగే వాటిని తమకు అనుకూలంగా మలుచుకున్న పార్టీల వివరాలు కూడా ఉన్నాయి. వీటిని వెల్లడించే హడావుడి, తొందరపాటులో తప్పు జరగకుండా చూసుకోవాలన్నదే మా అభిమతం. తీర్పును పరిశీలిస్ బాండ్ల కొనుగోలుదారుల వివరాలతో పాటు వాటిని తీసుకున్న రాజకీయ పార్టీల వివరాలు ఇవ్వాలని ఉంది. ఈ రెండింటిని జోడించకుండా వివరాలు ఇవ్వాలంటే 3 వారాల్లోగా ఇచ్చేందుకు స్టేట్ బ్యాంక్ సిద్ధం. మాకు కొంత సమయం ఇవ్వండి. మీరు చెప్పినట్టు చేస్తాం” అని సాల్వే వాదనలు వాదనలు వినిపించారు.
 
జస్టిస్ డీవై చంద్రచూడ్‌తో కలిపిన ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఎస్బీఐ వినతిపై ఇలా స్పందించింది: “కొనుగోలుదారులు, రాజకీయ పార్టీల వివరాలన్నీ ముంబై మెయిన్ బ్రాంచిలో ఉన్నాయని అఫిడవిట్లో చెప్పారు కదా. అలాగే బాండ్ల కొనుగోలు దారులు, రాజకీయ పార్టీల వివరాలను మ్యాచ్ చేయాలని, అందుకు సమయం కావాలని కోరారు. మేం మ్యాచింగ్ చేసి వివరాలు వెల్లడించాలని ఆదేశించలేదు. మీ దగ్గర ఉన్నది ఉన్నట్టుగా సమాచారం ఇవ్వాలని మాత్రమే కోరాం”. 
 
“బాండ్లు కొన్నవారి వివరాలన్నీ సీల్డ్ కవర్‌లో ఉన్నాయని చెప్పారు. వాటిని తెరిచి వివరాలు ఇస్తే సరిపోతుంది. తమ వద్ద ఉన్న సమాచారాన్ని సీల్డ్ కవర్లో ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించాం. వాటిని మేం తెరవలేదు. బాండ్ల రద్దుపై ఫిబ్రవర్ 15న తీర్పునిచ్చాం. ఇవాళ మార్చి 11. ఈ 26 రోజుల్లో ఏం చేశారో స్టేట్ బ్యాంక్ చెప్పలేదు. స్టేట్ బ్యాంక్ నుంచి మేం నిజాయతీ ఆశించాం. ప్రతి లావాదేవీకి కేవైసీ ఉంది. తప్పు జరిగే అవకాశం ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన సీల్డ్ కవర్ తెరవాలని ఆదేశిస్తాం. స్టేట్ బ్యాంక్ మా ఆదేశాలు పాటించాలి. రాజకీయ పార్టీల వివరాలు అందించడానికి మూడు వారాల గడువెందుకు. బాండ్లు కొన్నవారి వివరాలు మీ వద్ద సిద్ధంగా ఉన్నాయి” అని కోర్టు పేర్కొంది.