పూరీ ఆలయంలో బంగ్లాదేశీయుల కలకలం

ఒడిశాలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయంలో ఓ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఇటీవల 9 మంది బంగ్లాదేశీయులు ఈ ఆలయంలోకి అనధికారికంగా ప్రవేశించారు. ఇది గమనించిన విశ్వహిందూ పరిషత్‌కు చెందిన కొందరు కార్యకర్తలు వెంటనే సింగ్‌ద్వార్ పోలీసు స్టేష‌న్ వ‌ద్ద ఫిర్యాదు న‌మోదు చేశారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయంలోకి కొందరు బంగ్లాదేశీయులు హిందూయేతర నిబంధనలను ఉల్లంఘించి ప్రవేశించారని వాళ్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. 

ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగి ఆదివారం సాయంత్రం వారిని అదుపులోకి తీసుకున్నారు. బంగ్లాదేశ్‌కు చెందిన కొందరు హిందూయేతరులు పూరీ జగన్నాథ్ ఆలయంలోకి ప్రవేశించినట్లు తమకు ఫిర్యాదు అందిందని, దాంతో తాము వెంటనే అక్కడికి చేరుకొని పర్యాటకుల్ని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

తాము 9 మంది బంగ్లాదేశీయుల్ని అరెస్టు చేశామని, వారిని విచారిస్తున్నామని చెప్పారు. ఒకవేళ వాళ్లు హిందువులు కాదని తేలితే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ సుశీల్ మిశ్రా తెలిపారు. వారి పాస్‌పోర్టులను తాము ధృవీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఆ తొమ్మిది మందిలో ఒకరు హిందువు అని తేలిందని, ఇతర వ్యక్తుల పాస్‌పోర్టులను సైతం పరిశీలిస్తున్నామని చెప్పారు. 

తొమ్మిది మందిలో నలుగురు ఆలయంలోకి ప్రవేశించినట్లు తమ ప్రాథమిక విచారణలో తేలిందని వెల్లడించారు. కోట్లాది మంది దర్శనం కోసం వచ్చే ప్రార్థనా స్థలాల్లో ఈ దేవాలయం ఒకటి. జగన్నాథుని రూపంలో విష్ణువు ఇక్కడ కొలువై ఉంటాడని నమ్ముతారు. కొన్ని దశాబ్దాల నుంచి ఈ ఆలయంలో కేవలం హిందువులకు మాత్రమే పూజలు నిర్వహించేందుకు అనుమతి ఉంది. 

హిందువులు కాని వ్యక్తులకు ఈ ఆలయంలోకి ప్రవేశం లేదు. విదేశీ పర్యాటకులకు కూడా ప్రవేశ నిషేధం ఉంది. ముస్లిం పాలకుల దాడుల తరువాత.. ఈ ఆలయంలోకి హిందూయేతరుల ప్రవేశానికి సంబంధించి ఈ నిబంధనలు రూపొందించడం జరిగిందని కొందరు నమ్ముతుంటారు. ఆలయాన్ని నిర్మించినప్పటి నుంచే ఈ నిబంధనలు అమల్లో ఉన్నాయని చెబుతున్నారు.