2047 వికసిత్ భారత్ పేరిట విజన్ ఇండియా పత్రం

లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు కేంద్ర మంత్రి మండలి ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిపిన సుదీర్ఘ భేటీలో 2047 వికసిత్ భారత్ పేరిట విజన్ ఇండియా డాక్యుమెంట్‌ను వెలువరించారు. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా రూపొందేందుకు తగు చర్యలు తీసుకోవడం ఈ వికసిత్ భారత్ ఆలోచనల సమాహారం, స్వరూపం అని ప్రధాని మోదీ తెలిపారు. 

ఇది మోదీ సారధ్యపు పాలనలో నిలిచే ప్రాదాన్యత క్రమం అంతకు మించి ప్రాధాన్యతా రంగం అని సగర్వంగా ప్రకటించారు. ఇందుకు అనుసరించే పలు విధానాలను ఎంచుకున్నామని, పాటించాల్సిన పద్ధతులను విశ్లేషించుకున్నామని వివరించారు. దేశ పౌరుల సాధికారికత, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ వంటివి ఈ విజన్‌లో ప్రదాన అంశాలుగా ఉంటాయి. 

ఇక ఈ పాతికేళ్ల ప్రణాళికలో భాగంగా తీసుకునే చర్యలతో భారతదేశం పూర్తి స్థాయిలో ప్రగతి స్థాయి దేశం అవుతుంది. సాంకేతికత, సృజనాత్మకతల దిశలో ప్రపంచానికి సరైన నాయకత్వం వహించే స్థాయికి చేరుకుంటుందని తెలిపిన ప్రధాని 2047 విజన్ ఈ విధంగా దేశానికి ఓ కీలక మలుపు అవుతుందని వివరించారు. 

ఈ విజన్ డాక్యుమెంట్‌ను ఆషామాషీగా రూపొందించలేదని, దేశవ్యాప్తంగా 2021 డిసెంబర్ నుంచి ఈ ఏడాది జనవరి వరకూ పలు ప్రాంతాలలో నిర్వహించిన 2700కు పైగా సమావేశాలు, ఇష్టాగోష్టుల తరువాత ఖరారు చేశారని వివరించారు. కేవలం ప్రభుత్వం అనుకుంటే ఇటువంటి విజన్ అమలు వీలు కాదు. అందుకే దీనికి ముందు ప్రభుత్వం 15 రకాల భాగస్వామ్యపక్షాలను గుర్తించింది.

వీరితో సంప్రదింపులు జరిపింది. పైగా ప్రభుత్వానికి అందిన 450 సిఫార్సులను పరిశీలించారని వివరించారు. ఈసారి మంత్రి మండలి భేటీకి దాదాపుగా అందరూ మంత్రులు, ప్రభు త్వ విభాగాల కార్యదర్శులు, ముఖ్య ఉన్నతాధికారులు హాజరయ్యారు. దేశంలో వినూత్న సాంకేతిక ఆవిష్కరణలకు, సృజనాత్మకతకు పట్టం కట్టడం జరుగుతుంది. దీని కోసం ఈసారి బడ్జెట్‌లో రూ 1 లక్ష కోటి నిధులను కేటాయించినట్లు ప్రధాని తెలిపారు. 

ఈ నిధుల ద్వారా సృజనాత్మకత, సాంకేతికల పరిజ్ఞానంలో భారతదేశం ప్రపంచ ఛోదకశక్తి అవుతుందని విశ్వాసంవ్యక్తం చేశారు. దేశంలో అత్యధిక జనాభా ఉంది. ఈ క్రమంలో క్రమేపీ జనాభాలో వయో తారతమ్యాలు పెరుగుతున్నాయి. జనాభాలో అత్యధిక శాతం వయస్సు పైబడుతోంది. ఇక యువతరం ఈస్థానంలోకి వస్తోంది. ఈ సంధి దశలో ఏర్పడే పలు సవాళ్లు, అందివచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకుని వికసిత భారత్ దిశలో ముందుకు సాగాల్సి ఉందని ప్రధాని తెలిపారు.

వికసిత్ భారత్ 2047 ప్రభుత్వం కీలక నినాదం అవుతుందని పేర్కొన్న ప్రధాని పరోక్షంగా పార్టీ శ్రేణులుదీనినే ఎన్నికలలో ప్రధాన స్లోగన్ చేసుకుని ముందుకు సాగాల్సి ఉందని పిలుపు నిచ్చారు. ప్రతి రంగంలోనూ, విభాగంలోనూ వికసిత్ భారత్ సంబంధిత సెమినార్లు ఏర్పాటు చేయాలి. దీని ద్వారా ఈ లక్షసాధనలో అవసరం అయిన ఆలోచనలు పంచుకునేందుకు, అవసరం అయిన కార్యాచరణకు దిగేందుకు వీలేర్పడుతుందని మంత్రులకు తెలిపారు. 

పారిశ్రామిక, వాణిజ్య లావాదేవీల సం బంధిత సంస్థలు, సమాఖ్యలు అయిన సిఐఐ, ఎఫ్‌ఐసిసిఐ వంటివి కూడా ఈ కోణంలో పలు రకాల సెమినార్లు, ఆలోచనల వేదికలను ఏర్పాటు చేసుకోవల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఇది వారికి తానిచ్చే సలహా అన్నారు. ప్రజల ఆదరణ పొందడం కీలకం అని, వచ్చే వంద రోజులలో ఈ మేరకు రూపొందించుకున్న అజెండాపైనా ప్రధాని దృష్టి సారించారు. 

2047 భవిష్య భారత్ ప్రణాళిక, ఇక ఇకపై మరో అయిదేండ్ల కార్యాచరణ కీలకం అని కూడా మంత్రులకు తెలిపారు. స్థానిక చాణక్యపురి డిప్లోమాటిక్ ఎన్‌క్లేవ్‌లోని సుష్మాస్వరాజ్ భవన్‌లో విస్తృతస్థాయి మంత్రి మండలి సమావేశం జరిగింది. ప్రస్తుత దశను అంతా వికసిత్ భారత్ 2047 కోణంలో పరిగణనలోకి తీసుకోండని మంత్రులు, అధికారులకు ప్రధాని మోదీ  సూచించారు. 

ఇక సంబంధిత మంత్రిత్వశాఖలు తమ పనితీరును తెలిపే రికార్డుల్లోకి వెళ్లాలి. ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? అమలు ఏ విధంగా జరిగింది? వీటిద్వారా ఎటువంటి ఫలితాలు, మార్పులు తలెత్తాయి అనేది విశ్లేషించుకుని తీరాల్సి ఉందని స్పష్టం చేశారు. పరిస్థితులు సవాళ్లు, మారుతున్న కాలం బట్టి ప్రభుత్వ నిర్వహణ పంథా మారాల్సి ఉంటుంది.

పరిపాలనా అనేది దైనందిన క్రమంలో సజావుగా ప్రభుత్వాల తరచూ జోక్యం ప్రమేయం లేకుండా సాగాల్సి ఉంటుంది. చర్యలకు తగ్గ ఫలితాలు ఉండాలి. ఇకపై అంతా ప్రగతిశీల ప్రభుత్వం, క్రియాశీలక ఉత్తమ పాలన వ్యవస్థలపై దృష్టి సారించాల్సి ఉందన్నారు. ఇక కేంద్రం చేపట్టిన పలు ప్రగతి ప్రజా కేంద్రీకృత పథకాలను, గత పది సంవత్సరాల పాలనను, అంతకు ముందటి పాలనా ఫలితాలను ప్రజలు బేరీజు వేసుకుని ఆలోచించుకుని, స్పందించే రీతిలో ప్రజలలో విరివిగా మనోభావాలను నాటాల్సి ఉంటుంది. 

ఇది జరిగితే విజయం మనేదే అని ప్రధాని ఈ దశలో స్పష్టం చేశారు. ఇప్పటి లోక్‌సభ ఎన్నికల విజయం కీలకమే, అయితే దీనికి వికసిత్ భారత్ 2047కు ముడిపెట్టడం దేశ ప్రజల భవిష్యత్తు, దేశ ఔన్నత్యపు కోణంలో మరింత ప్రధానమైన విషయం అని, దీనిని క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, నేతలు ఏ విధంగా మారుమూల ప్రజల వద్దకు తీసుకువెళ్లుతారనేదే కీలకం అని చెప్పారు.