చైనా అభ్యంతరాలను తిప్పికొట్టిన తైవాన్, భారత్

“మా విదేశాంగ మంత్రి జోసఫ్‌ వూని భారత ఆంగ్ల మీడియా ఇంటర్వ్యూ చేస్తే చైనాకు అభ్యంతరం దేనికి?” అంటూ తైవాన్‌ ప్రశ్నించింది. భారత్‌, తైవాన్‌ దేశాలు పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనాలో అంతర్భాగాలు కావని ఘాటుగా వ్యాఖ్యానించింది. చైనాకు తాము కీలు బొమ్మలం కాదని స్పష్టం చేసింది.  పత్రికా స్వేచ్ఛ భారత్‌, తైవాన్‌ రెండు దేశాల ప్రజాస్వామ్యాల్లో ఉన్నదని తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. అంతేగాక, చైనా పొరుగు దేశాలను వేధించడం మానుకుని, తమ ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుండటంపై ఆందోళన చెందాలని తైవాన్‌ హితవు పలికింది. 

ఇదిలావుంటే తైవాన్‌ నేషనల్‌ డేను ఏ విధంగా కవర్‌ చేయాలో 2020లో చైనా దౌత్యకార్యాలయం భారత మీడియాకు పాఠాలు చెప్పింది. ఈ మేరకు జర్నలిస్టులకు మెయిల్స్‌ పంపింది. దీనిపై నాడు భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. “మా దేశంలో మీడియాకు స్వేచ్ఛ ఉంది. సరైనది అనుకున్న అంశాలను మీడియా రిపోర్టు చేస్తుంది” అంటూ చైనా దౌత్య కార్యాలయానికి భారత్‌ సమాధానం ఇచ్చింది. 

అప్పుడు కూడా తైవాన్‌ విదేశాంగ శాఖ భారత మీడియాకు అండగా నిలిచింది. తాజాగా భారత మీడియా తైవాన్‌ విదేశాంగ మంత్రిని ఇంటర్వ్యూ చేయడం చైనాకు ఆగ్రహం తెప్పించింది. “మా అనుమతి లేకుండా ఇంటర్వ్యూ ఎలా చేస్తారు?” అంటూ భారత్‌పై మండిపడింది. భారత మీడియా ద్వైపాక్షిక ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని చైనా ఆరోపించింది. 

భారత్‌కు చెందిన ఆంగ్ల మీడియా ఫిబ్రవరి ఆఖరులో తైవాన్‌ విదేశాంగ మంత్రి జోసఫ్‌ వూ ఇంటర్వ్యూను ప్రసారం చేసింది. ఈ ఇంటర్వ్యూలో తైవాన్‌కు చెందిన అంశాలపై ఆయన మాట్లాడారు. దాంతో ఆగ్రహించిన చైనా భారత మీడియా తప్పుడు సమాచారం వ్యాప్తి చేస్తోందని, తైవాన్‌ స్వాతంత్ర్యానికి వేదికను కల్పిస్తోందని ఆరోపించింది. 

అది ఒకే చైనా సూత్రానికి విరుద్ధమని పేర్కొంది. తాము ఇలాంటి వాటిని ఏమాత్రం అంగీకరించబోమని తెలిపింది. ప్రపంచంలో ఒక్క చైనా మాత్రమే ఉందని, తైవాన్‌ తమలో అంతర్భాగమని వ్యాఖ్యానించింది. పీపుల్స్‌ రిపబ్లిక్‌ ఆఫ్‌ చైనా ప్రభుత్వమే అంతటికి ప్రాతినిధ్యం వహిస్తుందని తెలిపింది.