గుండెపోటుతో మరో రైతు మృతి.. ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ వాయిదా!

* హ‌రియాణ రైతులకు రుణమాఫీ

పంజాబ్-హర్యానా సరిహద్దులోని ఖనౌరి పాయింట్ వద్ద రైతుల ఛలో ఢిల్లీ యాత్రలో భాగంగా ఆందోళన చేస్తున్న ఒక 62 ఏళ్ల రైతు గుండెపోటుతో మరణించినట్లు రైతు నాయకుడు ఒకరు శుక్రవారం తెలిపారు. పంజాబ్ బటిండా జిల్లాలోని అమర్‌గఢ్ గ్రామానికి చెందిన దర్శన్ సింగ్ అనే రైతు గుండెపోటుతో మరణించినట్లు రైతు నాయకుడు శర్వన్ సింగ్ పంధెర్ తెలిపారు. 

దర్శన్‌ సింగ్‌ (62) ఫిబ్రవరి 13 నుండి కన్నౌరి సరిహద్దులోనే ఉంటూ నిరసన తెలుపుతున్నాడు. గురువారం అర్థరాత్రి అస్వస్థతకు గురికావడంతో ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

ఇలా ఉండగా, ‘ఢిల్లీ చలో’ పాదయాత్రకు ప్రస్తుతానికి విరామం ప్రకటించారు. సంయుక్త కిసాన్ మోర్చా ‘ఢిల్లీ చలో మార్చ్’ ఫిబ్రవరి 29కి వాయిదా వేసింది. తదుపరి వ్యూహంపై 29న నిర్ణయం తీసుకుంటామన్నారు. ఫిబ్రవరి 24న ‘క్యాండిల్‌ మార్చ్‌’ చేపడతామని, ఫిబ్రవరి 26న కేంద్రం దిష్టిబొమ్మను దహనం చేస్తామని ప్రకటించారు.

కాగా, హిసార్ జిల్లా నార్నాండ్ సబ్ డివివిజన్‌లోని ఖేరి చోప్టాలో నిరసన వ్యక్తం చేస్తున్న రైతులను చెదరగొట్టడానికి పోలీసులు లాథిచార్జ్‌ను ఆశ్రయించడంతో పలువురు రైతులు, పోలీసులు శుక్రవారం గాయపడ్డారు. కొంతమంది పోలీసులు ట్రాక్టర్ల కీలను లాక్కోవడం ప్రారంభించిన తరువాత సుమారు రెండు గంటలు కొనసాగిన హింసాత్మక ఘర్షణలో పలువురు గాయపడ్డారు.

ఘర్షణలో రైతులు, పోలీసుల వాహనాలు కూడా దెబ్బతిన్నాయి. డిఎస్‌పి రవీందర్ సంగ్వాన్, డిఎస్‌పి రాజ్ సింగ్, షో చందర్ భన్ గాయపడిన వారిలో ఉన్నారు. కొంతమంది గాయపడిన రైతులను ఖేరి చోప్టా వద్ద ప్రైవేట్ ఆసుపత్రులలో చేర్పించారు. సురేష్ కోత్, కుల్దీప్ ఖరర్‌లతో సహా పలువురు రైతు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తమ పంటలకు కనీస గిట్టుబాటు ధర(ఎంఎస్‌పి)పై చట్టం కల్పించడంతోపాటు వివిధ డిమాండ్ల సాధన కోసం ఛలో ఢిల్లీ యాత్రను చేపట్టిన పంజాబ్ రైతులు పంజాబ్, హర్యానా సరిహద్దుల్లోని శంభూ, ఖనౌరి పాయింట్ల వద్ద  నిరసన తెలుపుతున్నారు.

ఇదే ఆందోళనలో భాగంగా ఇటీవల ఒక 72 ఏళ్ల రైతు గుండెపోటుతో మరణించాడు. శంభూ సరిహద్దున మరో 63 ఏళ్ల రైతు కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించాడు. కాగా బుధవారం ఖనౌరీ పాయింట్ వద్ద హర్యానా పోలీసులకు, పంజాబ్ రైతులకు మధ్య జరిగిన ఘర్షణలో బటిండాకు చెందిన శుభ్‌కరణ్ అనే 21 ఏళ్ల యువ రైతు మరణించాడు.

 ఖనౌరీ వద్ద బారికేడ్లను ఛేదించుకుని ముందుకు వెళ్లడానికి ప్రయత్నించిన కొందరు రైతులతో పోలీసులు ఘర్షణ పడినపుడు ఈ ఘటన జరిగింది. ఈ ఘర్షణలో 12 మంది పోలీసు సిబ్బంది కూడా గాయపడ్డారు. యువ రైతు మరణాన్ని పురస్కరించుకుని రెండు రోజులపాటు ఛలో ఢిల్లీ యాత్రకు విరామం ప్రకటించిన రైతు నాయకులు  శంభూ, ఖనౌరీ పాయింట్ల వద్ద వందలాది ట్రాక్టర్ ట్రాలీలతో రోడ్లను అడ్డగిస్తూ అక్కడే మకాం వేసి ఉన్నారు.

  కాగా,ఈనెల 21వ తేదీన క‌న్నౌరి బోర్డ‌ర్ వద్ద జ‌రిగిన కాల్పుల్లో మృతిచెందిన రైతు శుభ్‌క‌ర‌ణ్ సింగ్ కుటుంబానికి పంజాబ్ ముఖ్యమంత్రి భ‌గ‌వంత్‌మాన్ సింగ్ న‌ష్ట‌ప‌రిహారాన్ని ప్ర‌క‌టించారు. కోటి రూపాయ‌ల న‌గ‌దుతో పాటు కుటుంబ‌స‌భ్యుల‌కు ఒక ప్ర‌భుత్వ ఉద్యోగాన్ని ఇవ్వ‌నున్న‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. శుభ్‌క‌ర‌ణ్ మృతికి కార‌ణ‌మైన పోలీసుపై చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న తెలిపారు.

యువ రైతు శుభ్‌కరణ్ సింగ్ మరణానికి బాధ్యులైన వారిపై పంజాబ్ పోలీసులు కేసు నమోదు చేసే వరకు అతని మృతదేహానికి అంత్యక్రియలు జరగవని శుక్రవారం రైతు నాయకులు ప్రకటించారు. పంజాబ్ ముఖ్యమంత్రి పరిహారం గురించి ప్రకటించిన కొద్దిసేపటికే ఈ ప్రకటన చేశారు.

శుభ్‌కరణ్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పంజాబ్ ముఖ్యమంత్రి ప్రకటించారని,  అయితే, హర్యానా భద్రతా సిబ్బందిపై పంజాబ్ ప్రభుత్వం కేసు నమోదు చేయలేదని బటిండ సీనియర్ ఎస్‌పి తమకు చెప్పారని సంయుక్త కిసాన్ మోర్చ(రాజకీయేతర) నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లేవాల్ విస్మయం వ్యక్తం చేశారు.

రెండు రోజులైనా పది రోజులైనా ఫర్వాలేదు..బాధ్యులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసేవరకు అంత్యక్రియలు జరిగే ప్రసక్తి లేదని శుభ్‌కరణ్ తల్లిదండ్రులకు కూడా చెప్పామని ఆయన తెలిపారు.

మరోవంక, డిమాండ్ల సాధ‌న‌కై రైతులు పోరుబాట ప‌ట్టిన క్ర‌మంలో హ‌రియాణ ముఖ్యమంత్రి మనోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ శుక్రవారం అసెంబ్లీ వేదికగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్ర బ‌డ్జెట్‌ను స‌మర్పిస్తూ పంట రుణాల‌పై వ‌డ్డీని మాఫీ చేస్తామ‌ని వెల్ల‌డించారు. గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 30 నాటికి పంట రుణాల‌పై వడ్డీ, పెనాల్టీల‌ను మాఫీ చేస్తున్నామ‌ని శాస‌నస‌భలో సీఎం ప్ర‌క‌టించారు.

ఈ ఏడాది మే 31లోగా అస‌లు మొత్తాన్ని చెల్లించే రైతుల‌కు ఇది వ‌ర్తిస్తుంద‌ని చెప్పారు. ఎంఎఫ్ఎంబీ (మేరీ ఫ‌స‌ల్ మేరీ బ్యోరా) వ‌ద్ద న‌మోదైన రైతుల‌కు ఈ ప‌ధ‌కం వ‌ర్తిస్తుంద‌ని తెలిపారు. పంట రుణాలపై వ‌డ్డీ మాఫీని విప‌క్ష నేత భూపీంద‌ర్ సింగ్ హుడా ప్ర‌స్తావిస్తూ రైతులు గురించి మాట్లాడుతున్న మీరు హ‌రియాణ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న చేప‌ట్టిన రైతుల‌పై ఎందుకు నాసా చట్టాన్ని ప్ర‌యోగిస్తున్నార‌ని నిల‌దీశారు.

దీనిపై సీఎం బ‌దులిస్తూ తానూ రైతు బిడ్డ‌నేన‌ని, రైతుల బాధ త‌న‌కు తెలుసునని వ్యాఖ్యానించారు. రైతుల కోసం ప‌ధ‌కం ప్ర‌క‌టిస్తే దాన్ని మీరు జీర్ణించుకోలేక‌పోతున్నార‌ని ఆరోపించారు.