ఉద్యోగం అంటూ రష్యా సైన్యంలో చేర్పిందిన దళారీలు

హైదరాబాద్‌కు చెందిన ముగ్గురితో సహా పలువురు భారతీయులు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో ఉక్రెయిన్ తో యుద్ధంలో పాల్గొంటున్నారు. దళారీలు రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తామని మోసం చేసి రష్యా ఆర్మీలో చేర్చినట్లు తెలుస్తోంది. నవంబర్ 2023 నుంచి దాదాపు 10 మంది భారతీయులు రష్యా-ఉక్రెయిన్ సరిహద్దులో మారియుపోల్, ఖార్కివ్, డోనెట్స్క్, రోస్టోవ్-ఆన్-డాన్‌లతో సహా వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయినట్లు సమాచారం.
 
వీరిలో ఒకరు మృతి చెందినట్లు తెలుస్తోంది. రష్యా సైన్యంలో ఇరుక్కుకుపోయిన యువకుల్లో తెలంగాణకు చెందిన ముగ్గురు, కర్ణాటకకు చెందిన ముగ్గురు, గుజరాత్‌కు చెందిన ఒకరు, కాశ్మీర్‌కు చెందిన ఇద్దరు, యూపీకి చెందిన ఒకరు ఉన్నారు. హైదరాబాద్ చెందిన మహ్మద్ అద్నాన్ సోదరుడు ఉపాధి కోసం రష్యా వెళ్లాడు. 
 
అయితే అక్కడికి వెళ్లిన తర్వాత బలవతంగా సైన్యంలో చేర్చుకున్నట్లు మహ్మద్ అద్నాన్ చెప్పాడు. ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న యూట్యూబర్ రష్యాలో ఉద్యోగం ఇప్పిస్తానని తన సోదరుడిని మోసం చేశాడని ఆరోపించాడు.  డిసెంబరులో రష్యాకు రెండవ రిక్రూట్‌లను పంపిన తరువాత, ఏజెంట్లు అదృశ్యమయ్యారని తెలిపాడు. 
 
ప్రొబేషన్ పీరియడ్‌లో నెలకు రూ.45,000 జీతం ఇస్తామని, మెడికల్ క్యాంపులు లేదా సెక్యూరిటీ పొజిషన్లలో ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని యువకులను ప్రలోభపెట్టినట్లు వివరించారు. రష్యన్ భాషలో వ్రాసిన ఒప్పందాలపై సంతకం సంతకం అద్నాన్ చెప్పాడు. వారు అనువాద కాపీలను కోరినప్పుడు, ఏజెంట్లు అందించలేదని పేర్కొన్నాడు. 
 
తన సోదరుడు రష్యా చేరుకున్న తర్వాత, వారికి రక్షణ ముసుగులో ఆయుధాలు ఇచ్చారు. కొన్ని రోజుల తర్వాత వారిని బలవంతంగా ఆయుధ శిక్షణ ఇచ్చి ఉక్రెయిన్ యుద్ధభూమికి పంపించారని విరించాడు. వార్ జోన్‌లో మొబైల్ నెట్‌వర్క్‌లు అందుబాటులో లేకపోవడంతో ఉక్రెయిన్‌కు పంపినప్పటి నుంచి తన సోదరుడిని సంప్రదించలేకపోయాడని అతను ఆవేదన వ్యక్తం చేశాడు.

జనవరి 23న కాల్పుల్లో ఒక యువకుడు గాయపడడంతో రష్యా సైన్యంలో భారతీయులు ఉన్నట్లు తేలింది. గాయపడిన యువకుడు వైద్య శిబిరం  నుంచి అతను తన కుటుంబ సభ్యులతో ఫోన్ మాట్లాడడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో బాధిత కుటుంబాలు సంబంధిత పత్రాలతో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను సంప్రదించాయి. యువకులను రక్షించాలని అధికారులను కోరాయి.

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా రష్యా ప్రభుత్వంతో మాట్లాడి యువకులను వెనక్కి తీసుకురావాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. “నరేంద్ర మోదీ ప్రభుత్వం రష్యా ప్రభుత్వంతో చర్చలు జరపాలని, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న 12 మంది భారతీయ యువకులను తిరిగి తీసుకురావాలి” అని కోరుతూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.