పాక్‌ ప్రధానిగా మరోసారి షెబాజ్‌ షరీఫ్‌

పాకిస్తాన్‌లో గత కొన్నిరోజులుగా నెలకొన్న అనిశ్చితి తొలగిపోయింది. పాకిస్తాన్‌ ముస్లిం లీగ్‌(పిఎంఎల్‌-ఎన్‌), పాకిస్తాన్‌ పీపుల్స్‌పార్టీ(పిపిపి) మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. పాక్‌ ప్రధానిగా నవాజ్‌ షరీఫ్‌ సోదరుడు షెబాజ్‌ షరీఫ్‌ మరోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. ఒప్పందంలో భాగంగా పాకిస్తాన్‌ పీపుల్స్‌పార్టీ నాయకుడు అసిఫ్‌ జర్దారిని అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు. 
 
ఇటీవల జరిగిన పాక్‌ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాని నేపథ్యంలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు అనివార్యమయ్యింది. ప్రభుత్వం ఏర్పాటుపై 12 రోజులుగా ప్రతిష్టంభన కొనసాగుతూ వస్తున్నది.  సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి పాకిస్థాన్‌ ముస్లిం లీగ్‌-నవాజ్‌ (పిఎంఎల్‌-ఎన్‌), పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ (పిపిపి) అగ్రనేతల మధ్య జరిగిన చర్చలు పలు దఫాలుగా అసంపూర్తిగా ముగిశాయి.
 
పిఎంఎల్‌-ఎన్‌ సీనియర్‌ నేత, సెనెటర్‌ ఇషాక్‌ డర్‌ నివాసంలో మంగళవారం జరిగిన సమావేశంలో చివరకు ఓ నిర్ణయానికి వచ్చారు.  ఎన్నికల అనంతరం ఏర్ప డిన ప్రతిష్టంభనను పరిష్కరించేం దుకు ఇప్పటికి ఇరు పార్టీల సమన్వ య కమిటీల మధ్య ఐదుసార్లు చర్చలు జరిగాయి. సోమవారం మూడు గంటల పాటు చర్చలు జరిగిన తర్వాత మంగళవారం జరిగిన తుది విడత చర్చలు ఫలించాయి.

మంగళవారం పిఎంఎల్‌-ఎన్‌ సీనియర్‌ నేత ఇషాక్‌ దార్‌ నివాసంలో జరిగిన సమావేశంలో రెండు పార్టీలకు చెందిన ప్రముఖ నేతలు పాల్గొన్నారు.  పిపిపి ప్రతినిధి బృందం నుండి మురాద్‌ అలీ షా, కమర్‌ జమాన్‌ కైరా, నదీమ్‌ అఫ్జల్‌ చాన్‌, ఇతర నేతలు సమావేశానికి హాజరైనట్లు స్థానిక మీడియా తెలిపింది. పిపిపిని మంత్రివర్గంలోకి తీసుకోవడానికి సంబంధించిన అంశాలపై కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లు పిఎంఎల్‌-ఎన్‌ నేత ఆజం నజీర్‌ విలేకర్లకు తెలిపారు. ఇదిలావుండగా, ముత్తెహిదా క్వామి మూవ్‌మెంట్‌ (పాకిస్తాన్‌) పిఎంఎల్‌-ఎన్‌కు మద్దతునిస్తామని సోమవారం ప్రకటించింది. ఈ పార్టీకి 17సీట్లు వున్నాయి.

ఫిబ్రవరి 8న పాకిస్థాన్‌లో నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలతో దేశంలో హంగ్‌ ఏర్పడిన సంగతి తెలిసిందే. దీంతో రాజకీయ ప్రతిష్టంభనకు ముగింపు పలికేందుకు పిఎంఎల్‌-ఎన్‌, పిపిపి సమన్వయ కమిటీల మధ్య ఇవి ఐదవ రౌండ్‌ చర్చలు కావడం గమనార్హం.    సోమవారం  మూడు గంటలపాటు కొనసాగిన చర్చలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. 

పిఎంఎల్‌-ఎన్‌, పిపిపి రెండూ తిరిగి రాత్రి పదిగంటలకు సమావేశానికి అంగీకరించాయి. అయితే సమావేశం జరగలేదు. చివరికి పిపిపితో బుధవారం చర్చలు తిరిగి ప్రారంభమవుతాయని సోమవారం రాత్రి 11 గంటలకు పిఎంఎల్‌-ఎన్‌ ప్రకటించి సమావేశాన్ని ముగించింది.  అనంతరం పిఎంఎల్‌-ఎన్‌ నేత అజం నజీర్‌ తరార్‌ మీడియాతో మాట్లాడుతూ చర్చలు సానుకూలంగా కొనసాగుతున్నాయని, పిపిపిని కేబినెట్‌లో చేర్చే అంశంపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.