గిరిజ‌న తెగ‌ల మ‌ధ్య ఘర్షణలో 64 మంది మృతి

ప‌ప్వా న్యూ గునియా దేశంలో జ‌రిగిన హింస‌లో 64 మంది మృతిచెందారు. ఆ దేశంలోని ప‌ర్వ‌త శ్రేణుల్లో ఉండే రెండు గిరిజ‌న తెగ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ జ‌రిగింది. ఓ ద‌ళం త‌మ వ‌ద్ద ఉన్న ఆయుధాల‌త మ‌రో తెగ‌పై కాల్పులు జరిపింది. ఎంగ్వా ప్రావిన్సులో ఈ ర‌క్త‌పాతం చోటుచేసుకున్న‌ది. గత ఏడాది 60 మంది మృతికి దారి తీసిన తెగల మధ్యనే ఇప్పుడు కూడా ఘర్షణలు చోటుచేసుకున్నాయి.
 
ప‌ర్వ‌త ప్రాంతాల్లో చాన్నాళ్ల నుంచి వ‌ర్గ పోరు న‌డుస్తోంది. అయితే గ‌త వారం చివ‌ర‌లో జ‌రిగిన హింస మ‌రీ దారుణ‌మ‌ని అధికారులు చెబుతున్నారు. అక్ర‌మంగా ఆ దీవిలో అత్యాధునిక ఆయుధాలు వ‌చ్చిన‌ట్లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. దీంతో స్థానిక గిరిజ‌న తెగ‌ల మ‌ధ్య ఘ‌ర్ష‌ణ మొద‌లైంది. 
 
రాజ‌ధాని పోర్ట్ మోర్సీబీకి 600 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న వాబాగ్ ప‌ట్ట‌ణంలో ఎక్క‌డ చూసినా మృత‌దేహాలు ఉన్నాయి. ఆ మృత‌దేహాల‌ను పోలీసులు సేక‌రిస్తున్నారు. హైల్యాండ్స్ ప్రాంతంలో జ‌రిగిన హింస‌లో ఇదే అతిపెద్ద ఘ‌ట‌న అని అధికారి జార్జ్ కాక‌స్ తెలిపారు. హింసాత్మ‌క ఘ‌ట‌న‌కు చెందిన గ్రాఫిక్ వీడియోలు పోలీసుల‌కు చేరాయి. 
 
కాల్పుల జ‌రిగిన ప్రాంతానికి చెందిన ఫోటోలు కూడా రిలీజ్ అయ్యాయి. ట్ర‌క్కుల్లో మృత‌ దేహాల‌ను లోడ్ చేస్తున్న దృశ్యాలు క‌లిచివేస్తున్న‌ట్లు అధికారులు చెప్పారు. భూమి, సంప‌ద కోసం గిరిజ‌నుల మ‌ధ్య గొడ‌వ జ‌రుగుతోంది. అయితే గ‌త ఏడాది జూలై నుంచి మూడు నెల‌ల పాట ఆ ప్రాంతంలో లాక్‌డౌన్ కూడా విధించారు. హింస నేప‌థ్యంలో అక్క‌డ క‌ర్ఫ్యూ, ట్రావెల్ ఆంక్ష‌లు విధించారు.
 
 గ‌త ఏడాది ఆగ‌స్టులో కూడా అక్క‌డ భారీ హింస చోటుచేసుకున్న‌ది. ఇటీవ‌ల జ‌రిగిన కొట్లాట‌లో సుమారు 17 గిరిజ‌న తెగ‌లు ఇన్వాల్వ్ అయిన‌ట్లు తెలుస్తోంది. ప‌ప్వా న్యూ గునియాలో జ‌రిగిన ఊచ‌కోత‌పై పొరుగు దేశం ఆస్ట్రేలియా విచారం వ్య‌క్తం చేసింది. ఆ మార‌ణ‌హోమం చాలా డిస్ట‌ర్బింగా ఉన్న‌ట్లు తెలిపింది.