కాంగ్రెస్‌ను వీడనున్న కమల్ నాథ్?

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు ఒక్కరొక్కరే నిష్క్రమిస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, మాజీ కేంద్ర మంత్రి కమల్ నాథ్, ఆయన కుమారుడు నకుల్‌నాథ్ త్వరలోనే కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరనున్నట్లు జోరుగా ఉహాగానాలు సాగుతున్నాయి. కమల్‌నాథ్ శనివారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకోవడంతో ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూరింది. 

కాంగ్రెస్‌ను వీడి బిజెపిలో చేరే విషయమై విమానాశ్రయంలో విలేకరులు ప్రశ్నించగా అలాందేదైనా ఉంటే ముందుగా మీడియాకే చెబుతానంటూ కమల్‌నాథ్ సమాధానాన్ని దాటవేశారు. అంత అత్యుత్సాహం పనికిరాదంటూ ఆయన మీడియాకు చురకలు అంటించారు. ఆ ఊహాగానాలను ఖండించడం లేదంటే మీరు బిజెపిలో చేరుతున్నారని భావించవచ్చా? అని ఒక విలేకరి ప్రశ్నించగా మీరు అత్యుత్సాహంతో అంటున్న ప్రతిదాన్ని ఖండించడం తన పని కాదని ఆయన వ్యాఖ్యానించారు.

అయితే, ఈ ఊహాగానాలను బలపరిచే విధంగా బిజెపి అధికార ప్రతినిధి, కమల్‌నాథ్ మాజీ మీడియా సలహాదారు నరేంద్ర సలూజా కమల్‌నాథ్, ఆయన కుమారుడికి సంబంధించిన ఒక ఫోటోను సోషల్ మీడియా ఎక్స్‌లో పోస్టు చేశారు. ఆ ఫోటోకు జై శ్రీరాం అని ఆయన శీర్షిక పెట్టడం విశేషం. 

ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లోని ఛింద్వారా లోక్‌సభ స్థానానికి కాంగ్రెస్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న నకుల్‌నాథ్ తన ఎక్స్ ఖతాలోని తన ప్రొఫైల్ నుంచి కాంగ్రెస్ పేరును తొలగించడం గమనార్హం.  త‌న‌ను రాజ్య‌స‌భ‌కు నామినేట్ చేయాల‌ని క‌మ‌ల్ నాథ్ కాంగ్రెస్ పార్టీని కోర‌గా, ఆ ప్ర‌తిపాద‌న‌ను పార్టీ అగ్ర‌నాయ‌క‌త్వం సున్నితంగా తిర‌స్క‌రించిన‌ట్లు ఆయ‌న మ‌ద్ద‌తుదారులు చెబుతున్నారు. రాజ్య‌స‌భ టికెట్ ఇవ్వ‌క‌పోవ‌డంతోనే క‌మ‌ల్ నాథ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

ఇదే విషయం గురించి కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ సింగ్ మాట్లాడుతూ తాను శుక్రవారం రాత్రే కమల్‌నాథ్‌తో మాట్లాడానని, నెహ్రూ- గాంధీ కుటుంబంతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వ్యక్తి పార్టీని వీడతారని ఎలా ఊహిస్తామని వ్యాఖ్యానించారు. అటువంటిది జరుగుతుందని కలలో కూడా ఊహించలేమని చెప్పారు. 

ఇదిలా ఉండగా మధ్యప్రదేశ్‌లోని సంకాచ్ నియోజవకర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే సజ్జన్ సింగ్ వర్మ కూడా తన సోషల్ మీడియా ప్రొఫెల్స్ నుంచి కాంగ్రెస్ లోగోను తొలగించారు. కమల్‌నాథ్ అనుచరుడిగా వర్మను పరిగణిస్తారు. ఇలా ఉండగా ఇటీవలనే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, మాజీ పిసిసి అధ్యక్షుడు అశోక్ చవాన్ కాంగ్రెస్‌ నుండి నిష్క్రమించి బిజెపిలో చేరారు. దీనికి కొద్ది రోజుల ముందే ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నాయకుడు మిలింద్ దేవర శివసేన(షిండే వర్గం)లో చేరి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కించుకున్నారు