ప్రఖ్యాత ఉర్దూ కవి, సంస్కృత పండితుడు లకుజ్ఞానపీఠ్‌

ప్రసిద్ధ ఉర్దూ కవి గుల్జార్,  సంస్కృత పాండిత్య దిగ్గజం జగద్గురు రామభద్రాచార్యలను 58వ జ్ఞాన్‌పీఠ్ అవార్డు విజేతలుగా ఎంపిక చేసినట్లు జ్ఞాన్‌పీఠ్ ఎంపిక కమిటీ శనివారం ప్రకటించింది. గుల్జార్‌గా సుప్రసిద్ధుడైన సంపూరణ్ సింగ్ కల్రా హిందీ చిత్ర రంగంలో విశిష్ట కృషి సల్పినవారు. ఆయనను ఈ శకం మేటి ఉర్దూ కవులలో ఒకరుగా పరిగణిస్తుంటారు. 

చిత్రకూట్‌లోని తులసీ పీఠ్ వ్యవస్థాపకుడు, అధిపతి రామభద్రాచార్య సుప్రసిద్ధ హిందూ ఆధ్యాత్మిక నేత, విద్యావేత్త. ఆయన నాలుగు పురాణ గ్రంథాలతో పాటు 240 పైచిలుకు పుస్తకాలు, పాఠ్యగ్రంథాలు రచించారు.  ‘రెండు భాషలలో నుంచి ప్రముఖ రచయితలకు (2023కు) సంస్కృత సాహితీవేత్త జగద్గురు రామభద్రాచార్య, ప్రముఖ ఉర్దూ సాహితీవేత్త గుల్జార్‌కు పురస్కారం ఇవ్వాలని నిర్ణయించడమైంది’ అని జ్ఞాన్‌పీఠ్ ఎంపిక కమిటీ ఒక ప్రకటనలో వెల్లడించింది. 

గుల్జార్ 2002లో సాహిత్య అకాడమీ అవార్డు, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు, 2004లో పద్మభూషణ్, తన రచనలకు గాను కనీసం ఐదు జాతీయ సినీ అవార్డులు అందుకున్నారు.  ఆయన 1936 ఆగస్టు 18న ప్రస్తుత పాకిస్థాన్‌లోని జీలం జిల్లా దీనాలో జన్మించారు. గుల్జార్‌ అనేది ఆయన కలాం పేరు కాగా, అసలుపేరు సంపూరణ్‌ సింగ్‌ కల్రా.

తండ్రి పేరు మఖన్‌ సింగ్‌ కల్రా, తల్లిపేరు సుజన్‌ కౌర్‌. దేశ విభజన సమయంలో గుల్జార్‌ కుటుంబం భారత్‌కు వచ్చింది. ఆయన పుఖ్‌రాజ్, ఏక్ బూంద్ చంద్, చౌరస్ రాత్, రవి పార్, కుచ్ ఔర్ నజ్మాన్, యార్ జులాహే ప్రధాన రచనలు. ముంబైలోని వర్లీలో గుల్జార్‌ కార్‌ మెకానిక్‌గా పని చేశారు. సినీ నటి రాఖీని వివాహం చేసుకున్నారు. 

గుల్జార్‌ తన తొలి పాట బియల్‌ రాయ్‌ చిత్రం బందినిలో ‘మోరా గోరా అంగ్‌ లై లే’. సద్మా సే ఏ జిందగీ గలే లగా లే, ఆంధీ సే తేరే బినా జిందగీ తదితర ఎన్నో పాటలు రాశారు. గుల్జార్ అద్భుత రచనలలో ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంలోని ‘జై హో’ పాట ఒకటి. ఆ గీతానికి ఆయన 2009లో ఆస్కార్ అవార్డు, 2010లో గ్రామీ అవార్డు అందుకున్నారు. 

అలాగే ఆనంద్‌, గుడ్డి, బావర్చి, నమక్ హరామ్, దో దూనీ చార్, ఖామోషి, సఫర్ తదితర కథలు రాశారు. దేశంలోని ప్రముఖ ఉర్దూ కవుల్లో ఒకరిగా పేరుపొందారు. ఆయన కలం నుంచి అనేక ఉర్దూ కవితలు, షాయరీలు జరువారగా.. ఉర్దూ, పంజాబీతో పాటు పలు భాషల్లోనూ అనేక కథలను సైతం రాశారు. అలాగే పలు చిత్రాలకు నిర్మాతగానూ వ్యవహరించారు. 

మేరే అప్నే చిత్రాన్ని తొలిసారి నిర్మించారు. ట్రై, మౌసం, ఇజాజత్ చిత్రాలకు మూడు జాతీయ అవార్డులు, 47 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు అందుకున్నారు. 2004లో పద్మభూషణ్, 2013లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డులు అందుకున్నారు.

ఆయన కొన్ని అవార్డు విజేత చిత్రాలకూ దర్శకత్వం వహించారు. వాటిలో కోషిష్ (1972), పరిచయ్ (1972), మౌసమ్ (1975), ఇజాజత్ (1977) చిత్రాలు, టెలివిజన్ సీరియల్ మీర్జా గాలిబ్ (1988) కూడా ఉన్నాయి. ‘గుల్జార్ తన సుదీర్ఘ సినీ ప్రస్థానంతో పాటు సాహితీ రంగంలో కొత్త మైలురాళ్లు నెలకొల్పారు’ అని భారతీయ జ్ఞాన్‌పీఠ్ ఒక ప్రకటనలో తెలియజేసింది.

జగద్గురు రామభద్రాచార్య పుట్టిన కొద్దిరోజులకే అంధత్వానికి గురైన ఆయన సంస్కృత పాండిత్య దిగ్గజంగా పేరుగాంచారు. రామభద్రాచార్య 1950 జనవరి 14న ఉత్తరప్రదేశ్‌లోని జౌన్‌పూర్‌ జిల్లాలో జన్మించారు. రామానంద శాఖకు చెందిన ప్రస్తుత నలుగురు జగద్గురువుల్లో ఒకరు. బాల్యంలోనే అంధత్వానికి గురైన ఆయన దివ్యాంగుల కోసం మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో యూనివర్సిటీని ప్రారంభించారు. జీవితకాల ఛాన్సెలర్‌ ఆయనే. 

ఆయన అసలుపేరు గిరిధర్‌ మిశ్రా. విశ్వవిద్యాలయం అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు వైకల్యాలున్న విద్యార్థులకు మాత్రమే అందిస్తుంది. రెండు నెలల వయసులోనే అంధత్వం బారినపడ్డారు. అయితే, ఆయన ఇన్నేళ్లలో ఎన్నడూ బ్రెయిలీ లిపిని ఉపయోగించకపోవడం విశేషం. ఆయన బహుభాషావేత్త. ఆయన మొత్తం 100 పుస్తకాలను రక్షించారు.

రామానంద్ తెగ ప్రస్తుత జగద్గురు రామభద్రాచార్యులు నలుగురిలో రామభద్రాచార్య ఒకరు. ఆయన 1982 నుంచి ఆ పదవిలో కొనసాగుతున్నారు. 22 భాషలు మాట్లాడగల రామభద్రాచార్య సంస్కృతం, హిందీ, అవధి, మైథిలితో సహా పలు భారతీయ భాషలలో కవి, రచయిత. ఆయన 20125లో పద్మ విభూషణ్ అవార్డు స్వీకరించారు.

గత సంవత్సరం గ్రహీత, గోవా రచయిత దామోదర్ మౌజో ప్రతిష్టాత్మక అవార్డుతో సత్కరించిన తర్వాత ఈ ప్రకటన వచ్చింది. జ్ఞానపీఠ్ అవార్డు ప్రదానోత్సవం వారి వారి భాషలలో ఈ గౌరవనీయులైన రచయితల సాహిత్య విజయాలు, రచనలకు నిదర్శనంగా నిలుస్తుంది. జ్ఞానపీఠ్ అవార్డును1944లో స్థాపించారు.భారతీయ సాహిత్యానికి విశేషమైన కృషిని గుర్తించి, వార్షిక ప్రాతిపదికన అందజేస్తారు.
 
ఈ సంవత్సరం, సంస్కృతంలో రెండవసారి, ఐదవసారి ఉర్దూలో ప్రతిభ కనబరిచినందుకు ఈ అవార్డును ప్రదానం చేస్తున్నారు. ఈ గౌరవప్రదమైన సన్మానం రూ. 21 లక్షల నగదు బహుమతితో పాటు వాగ్దేవి విగ్రహం, ప్రశంసా పత్రాన్ని కలిగి ఉంటుంది. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత ప్రతిభా రాయ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ గ్రహీతలను ఎంపిక చేసింది.