370 సీట్లు గెల‌వ‌డమే ముఖ‌ర్జీకి నిజమైన నివాళి

లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో 370 సీట్లు గెల‌వ‌డం త‌మ పార్టీ సిద్ధాంత‌క‌ర్త శ్యామ ప్ర‌సాద్ ముఖ‌ర్జీకి నిజ‌మైన నివాళి అవుతుంద‌ని ప్ర‌ధాని నరేంద్ర మోదీ తెలిపారు.  ఆర్టిక‌ల్ 370ని శ్యామ్ ప్ర‌సాద్ ముఖ‌ర్జీ తీవ్రంగా వ్య‌తిరేకించిన‌ట్లు మోదీ గుర్తు చేశారు. జ‌మ్మూక‌శ్మీర్‌కు ప్ర‌త్యేక హ‌క్కులు క‌ల్పించే ఆ ఆర్టిక‌ల్‌ను బీజేపీ స‌ర్కారు 2019 ఆగ‌స్టులో ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. 
 
రెండు రోజుల పాటు జరిగే లోక్ సభ ఎన్నికల సన్నాహాక సమావేశాల సందర్భంగా పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్ల సమావేశాన్ని ప్రధాని మోదీ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభిస్తూ పోలింగ్ బూత్‌ల‌పై దృష్టిపెట్టాల‌ని కోరారు.  బిజెపి లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని బిజెపి ప్రభుత్వాలు చేబడుతున్న పేదలకు  అనుకూలమైన కార్యక్రమాలు, సాధించిన దేశ అభివృద్ధి, ప్రపంచవ్యాప్తంగా మెరుగుపరచబడిన భారత దేశపు స్థాయి చుట్టూ నిర్మించాలని ప్రధాని బిజెపి నేతలకు సూచించారు. 
 
 ప్రతి బూత్ కార్యకర్త ఇప్పుడు పోలింగ్ బూత్‌లపై దృష్టి పెట్టాలని, 2019 కంటే ఎక్కువగా రాబోయే ఎన్నికల్లో పార్టీకి కనీసం 370 ఓట్లు వచ్చేలా చూసుకోవాలని ఆయన చెప్పారు. మోదీ ప్రసంగాన్ని మీడియాకు వివరించిన బిజెపి ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే మాట్లాడుతూ, ఎన్నికల సమయంలో ప్రతిపక్షాలు “అనవసరమైన, భావోద్వేగ సమస్యలను” లేవనెత్తుతాయని ప్రధాని వారించారని తెలిపారు. 
 
 అయితే పార్టీ సభ్యులు అభివృద్ధి, పేదల అనుకూల విధానాలు, ప్రపంచంలో పెరుగుతున్న భారత్ పరపతి వంటి దేశానికి సంబంధించిన అంశాలకు కట్టుబడి ఉండాపెరుగున్న లని సమావేశంలో ప్రధాని చెప్పారని పేర్కొన్నారు.  ఫిబ్రవరి 25 నుండి వివిధ కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్ధిదారులకు చేరుకోవడానికి పార్టీ ప్రచారాన్ని ప్రారంభిస్తుందని తావ్డే చెప్పారు.
 
12 ఏళ్లపాటు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉండడంతో పాటు దాదాపు 23 ఏళ్ల పాటు ప్రభుత్వానికి అధిపతిగా ఉన్నప్పటికీ ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. “ఇది ఒక ‘ఆరోప్ ముక్త్’, ‘వికాస్ యుక్త్’ కాలం,” అని వివరిస్తూ  ఇంత సుదీర్ఘ పదవీకాలం ఎవరూ ఎటువంటి కళంకం లేకుండా పనిచేసిన సందర్భం లేదని స్పష్టం చేశారు. 
 
ఢిల్లీ భారత్ మండపంలో జరుగుతున్న సమావేశాలలో హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజనాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎంపీలు, కోర్ కమిటీ సభ్యులు, మంత్రులు, సీనియర్ నేతలు హాజరయ్యారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను తెలిపే ఎగ్జిబిషన్‌ను ప్రధాని మోదీ ఈ సందర్భంగా ప్రారంభించారు.