ఢిల్లీ అలీపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. 11 మంది సజీవ దహనం

దేశ రాజధాని ఢిల్లీ అలీపూర్‌లోని మార్కెట్‌లో జరిగిన అగ్నిప్రమాదం ఘటనలో 11 మంది దుర్మరణం చెందారు. ఓ పేయింట్‌ పరిశ్రమలో గురువారం సాయంత్రం మంటలు చెలరేగాయి. మంటలు సమీపంలోని దుకాణాలతోపాటు ఇండ్లకు వ్యాపించాయి. అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లోని ఫ్యాక్టరీలో 11 మంది కాలిపోయిన మృతదేహాలు లభ్యమైనట్లు అధికారులు తెలిపారు. 
 
అగ్నిప్రమాదంలో ఒక పోలీసు సహా నలుగురు గాయపడి చికిత్స పొందుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మరో ఇద్దరు అగ్నికీలల్లో చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.  మృతదేహాలన్నీ పూర్తిగా కాలిపోయాయని, మృతులను ఇంకా గుర్తించలేదని పోలీసులు తెలిపారు. మృతుల్లో ఒక మహిళ కూడా ఉన్నారని తెలిపారు. అవి ఫ్యాక్టరీలోని కార్మికులవిగా అనుమానిస్తున్నారు.
 
దయాళ్ మార్కెట్ కు సమీపంలోని నెహ్రూ ఎన్ క్లేవ్ లోని పెయింట్ ఫ్యాక్టరీలో గురువారం సాయంత్రం 5:25 గంటలకు అగ్నిప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదం జరిగిన పెయింట్ ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న అనేక ఇతర నివాస భవనాలకు కూడా మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాద సమాచారం తెలియగానే 22 అగ్నిమాపక యంత్రాలను సంఘటనా స్థలానికి పంపించామని ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ అతుల్ గార్గ్ తెలిపారు. 
 
అలీపూర్ పోలీస్ స్టేషన్ కు చెందిన ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుని పెయింట్ ఫ్యాక్టరీని ఆనుకుని ఉన్న భవనాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసకువచ్చారు. ఈ ప్రమాదంలో చిక్కుకున్న ఆరుగురిని సాహసోపేతంగా రక్షించిన ఒక కానిస్టేబుల్ పై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఆ కానిస్టేబుల్ కరం వీర్ మంటలు వ్యాపించిన భవనంలోనికి ధైర్యంగా వెళ్లి బాధితులను రక్షించారు.
 
అయితే, మంటల చెలరేగడానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు శబ్దం వినిపించింది. అక్కడ నిల్వ ఉంచిన రసాయనాలతో పేలుడు సంభవించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. ‘పరిశ్రమ పక్కనే ఉన్న నాషా ముక్తి కేంద్రంలోకి మంటలు వ్యాపించాయి. పేలుడు కారణంగా భవనం కూలిపోయింది. 11 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వారిని గుర్తించడం కష్టంగా ఉంది’ అని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ డైరెక్టర్‌ అతుల్‌ గార్గ్‌ తెలిపారు. 
 
అగ్నిప్రమాదంలో మృతిచెందిన వారి కుటుంబాలకు సీఎం అర్వింద్‌ కేజ్రివాల్ రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అదేవిధంగా తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల చొప్పున, స్వల్పంగా గాయపడిన వారికి రూ.20 వేల చొప్పున పరిహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. అదేవిధంగా రెసిడెన్షియల్‌ ఏరియాలో ఫ్యాక్టరీ నడుపుతున్నందుకు ఫ్యా్క్టరీ యజమానిపై కూడా తగిన చర్యలు తీసుకుంటామని కేజ్రివాల్‌ తెలిపారు.