ఒంటిపై వస్త్రం లేని సరస్వతీ విగ్రహం

 
* ఏబీవీవీ, బజరంగ్ దళ్ కార్యకర్తల ఆందోళన
 
విద్యాబుద్దులు ప్రసాదించే అమ్మవారు సరస్వతీ దేవి. వసంత పంచమి రోజున సరస్వతీ దేవిని నిష్టగా కొలుస్తారు. అయితే, వసంత పంచమి సందర్భంగా ఓ ప్రభుత్వ కాలేజీలో నిర్వహించిన సరస్వతీ పూజపై తీవ్ర దుమారం రేగుతోంది. పూజలో అచ్చాదనం లేకుండా ఉన్న అమ్మవారి విగ్రహాన్ని ఉంచడం అందుకు కారణం. సంప్రదాయంగా ధవళ వర్ణం చీరలో ఉండే అమ్మవారి విగ్రహాన్ని ఆరాధిస్తారు.
 
త్రిపుర ఆర్డ్ అండ్ క్రాప్ట్ కాలేజీలో అమ్మవారిని అవమానించారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మండిపడింది. ఆ విగ్రహనికి చీర కట్టాలని కాలేజీ యాజమాన్యంపై ఒత్తిడి చేశారు. ఏబీవీపీకి భజరంగ్ దళ్ జత కలిసింది. కాలేజీ మేనెజ్ మెంట్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేసింది. హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా సరస్వతి దేవిని అసభ్యంగా చిత్రీకరించారని మండిపడుతున్నారు.
 
ఏబీవీపీ త్రిపుర యూనిట్ ప్రధాన కార్యదర్శి దివాకర్ ఆచార్జీ నాయకత్వంలో ఆందోళనకు దిగారు. ‘ఈ రోజు వసంతపంచమి అని అందరికీ తెలుసు.. సరస్వతి దేవిని దేశవ్యాప్తంగా పూజలు నిర్వహిస్తారు.. ప్రభుత్వ ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ కాలేజీలో సరస్వతీ దేవి విగ్రహాన్ని చాలా తప్పుగా, అసభ్యంగా మలచారని సమాచారం వచ్చింది’ అని దివాకర్ ఆరోపించారు.

మరోవైపు, ఈ వివాదంపై కాలేజీ యాజమాన్యం స్పందించింది. ఈ విగ్రహం హిందూ దేవాలయాల్లోని సంప్రదాయ శిల్ప రూపాలకు కట్టుబడి ఉందని, మతపరమైన మనోభావాలను కించపరిచే ఉద్దేశం లేదని అధికారులు వివరించారు.  చివరికి ఏబీవీపీ, భజరంగ్ దళ్ ఒత్తిడికి తలొగ్గింది. కాలేజీలో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని అక్కడి నుంచి తొలగించింది. పూజ మందిరం వెనక ప్లాస్టిక్ షీట్లతో కప్పి ఉంచింది
 
మరోవైపు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కానీ, ఏబీవీపీ, బజరంగ్ దళ్ దీనిపై తమకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.