హింసాత్మకంగా రైతుల చలో ఢిల్లీ.. హడావుడి తగదన్న కేంద్ర మంత్రులు

 
* తక్షణమే కొత్త చట్టం చేయడం కుదరదు
 
పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, రైతు రుణాల మాఫీ తదితర డిమాండ్లతో మంగళవారం రైతులు చేపట్టిన చలో ఢిల్లీ మార్చ్‌ హింసాత్మకంగా మారింది. ఢిల్లీ వెళ్లేందుకు రైతులు శతవిధలా ప్రయత్నించారు. రైతు నేతలు, రైతులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. బారికేడ్లను తొలగించి వచ్చేందుకు రైతులు ప్రయత్నించారు. వారిని నిలువరించేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. 
 
పోలీసుల దాడిలో రైతులు, మీడియా ప్రతినిధులు దాదాపు 60 మంది వరకు గాయపడ్డారు. మొత్తం 100 మంది గాయపడ్డారని రైతు సంఘం నేతలు ప్రకటించారు. మంగళవారం రాత్రి ఛలో ఢిల్లీ కార్యక్రమానికి బ్రేక్ ఇచ్చారు. బుధవారం ఉదయం నుంచి ఛలో ఢిల్లీ కార్యక్రమం ఉంటుందని స్పష్టం చేశారు.
 
అన్ని పంటలకు కనీస మద్దతు ధర ఇవ్వాలని రైతు నేతలు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. రైతులకు రుణమాఫీ చేయాలని కోరుతున్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని స్పష్టం చేశారు. 2020 విద్యుత్ సవరణ చట్టం ద్వారా వచ్చే ఒఫ్పందాలు రద్దు చేయాలని, ఉత్తరప్రదేశ్ లఖిమ్ పూర్ ఖేరి మృతులకు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు. 
 
2020లో ఆందోళన చేసిన సమయంలో నమోదు చేసిన కేసులను వెంటనే విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీటిలో ముఖ్యమైన డిమాండ్లకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు. దాంతో ఛలో ఢిల్లీ కార్యక్రమం కోసం 200 రైతు సంఘాలు పిలుపునిచ్చాయి. ఢిల్లీలోకి అనుమతించకుంటే, ఢిల్లీ వెలుపల 6 నెలలు వరకు నిరసనలు చేపడుతామని రైతు నేతలు స్పష్టంచేశారు. అందుకోసం ఆహార పదార్థాలు, డీజిల్, వంట నూనె ఇతర సామాగ్రి తమ వెంట తీసుకొచ్చామని వివరించారు.
 
పంజాబ్‌, హర్యానా నుంచి వేలాది మంది రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీ వైపు కదలగా, వారిని అడ్డుకునేందుకు పోలీసులు పెద్ద ఎత్తున బారికేడ్లు ఏర్పాటుచేశారు. బారికేడ్లు బద్ధలు కొట్టి ముందుకు వెళ్లేందుకు రైతులు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై బాష్పవాయు గోళాలను, జల ఫిరంగులను ప్రయోగించారు. లాఠీచార్జి చేశారు. మరోవైపు ఢిల్లీ సరిహద్దుల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 
బహుళ అంచెల్లో బారికేడ్లు ఏర్పాటుచేశారు. భారీగా బలగాలను మోహరించారు.
 
సింఘు, టిక్రి సరిహద్దులను మూసివేశారు. శంభు సరిహద్దు వద్ద రైతులు మెటల్‌ బారికేడ్లను తొలగించేందుకు ప్రయత్నించడంతో పోలీసులు వారిపై డ్రోన్లతో టియర్‌గ్యాస్‌ను ప్రయోగించారు. పోలీసులపై రాళ్లు రువ్వడంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భాష్పవాయువును ప్రయోగించామని పోలీసుల తెలిపారు. జింద్‌ సరిహద్దులోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. రైతులపైకి పోలీసులు టియర్‌గ్యాస్‌, జలఫిరంగులను ప్రయోగించారు. 
 
రైతుల మార్చ్‌ నేపథ్యంలో ఢిల్లీలోని 9 మెట్రో రైల్వే స్టేషన్లలో గేట్లను మూసేశారు. ప్రయాణికులను ఇతర గేట్ల గుండా స్టేషన్లలోకి అనుమతించారు. భద్రతా కారణాల దృష్ట్యా ఎర్రకోటను తాత్కాలికంగా మూసివేశారు.
 
కాగా, కనీస మద్దతు ధరపై తక్షణమే చట్టం చేయటం కుదరదని కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా స్పష్టం చేశారు. దీనిపై రైతు సంఘాలు చర్చకు రావాలని పిలుపునిచ్చారు. రైతులను కొన్ని శక్తులు రెచ్చగొడుతున్నాయని విపక్షాలనుద్దేశించి ఆరోపిస్తూ రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనుకున్నదే తడవు చట్టం చేయటానికి వీలుపడదని, దీనిపై అన్ని వర్గాలతో సుదీర్ఘంగా చర్చించాల్సి ఉన్నదని తేల్చి చెప్పారు. 
 
ఈ ఆందోళనలపై ఇప్పటికే కేంద్రమంత్రులు పీయూషీ గోయల్‌, అర్జున్‌ ముండా నేతృత్వంలోని ప్రభుత్వ బృందం రైతు ప్రతినిధులైన ఎస్‌కేఎం నేత జగ్జీత్‌ సింగ్‌ డల్లేవాల్‌, కిసాన్‌ మజ్దూర్‌ సంఘర్ష్‌ కమిటీ ప్రధాన కార్యదర్శి సర్వన్‌సింగ్‌ పంధేర్‌ తదితరులతో సోమవారం చర్చించింది. రైతులు చేసిన డిమాండ్లలో కొన్నింటిని అంగీకరించింది. కనీస మద్దతు ధరపై మాత్రం  ఏకాభిప్రాయానికి రాలేదు.
 
ఇలా ఉండగా, ప్రభుత్వం మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యుపిఎ ప్రభుత్వం కంటే వ్యవసాయ రంగానికి చాలా ఎక్కువ చేసిందని కేంద్రం స్పష్టం చేసింది. రైతుల తాజా సమస్యల జోడింపుపై విస్తృత చర్చలు అవసరమని కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. చర్చలకు ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందని, డిమాండ్‌ వచ్చినప్పుడల్లా ప్రభుత్వమే ముందుకు వస్తుందని ఆయన పేర్కొన్నారు.
 
చండీగఢ్ లో కేంద్ర మంత్రులు చర్చల కోసం అర్ధరాత్రి వరకు చాలా గంటలు కూర్చున్నారని, ఆందోళనకారులతో రెండు దఫాలుగా చర్చలు జరిపారని ఆయన గుర్తు చేశారు. చర్చలు కొనసాగించడానికి ప్రభుత్వం ఇంకా అనుకూలంగా ఉన్నప్పటికీ  నిరసనకారులు అక్కడి నుండి వెళ్లిపోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు.
 
“ఏదైనా సమస్యకు పరిష్కారం చర్చల ద్వారా మాత్రమే వస్తుంది…. రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది. గత 10 ఏళ్లలో దేశ వ్యాప్తంగా కోట్లాది మంది రైతులు వివిధ ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందారు. నిరంతరం కొత్త సమస్యలను జోడించడం ద్వారా, వెంటనే పరిష్కారం సాధించలేమని నిరసనకారులు అర్థం చేసుకోవాలి” అని కేంద్ర మంత్రి హితవు చెప్పారు.
 
స్వేచ్ఛా-వాణిజ్య ఒప్పందాన్ని ముగించడం; స్మార్ట్ మీటర్ల సంస్థాపన ఆపడం; చర్చల నుండి పొట్టను కాల్చే సమస్యను మినహాయించడం లేదా వాతావరణ సమస్య నుండి వ్యవసాయాన్ని మినహాయించడం వంటి సమస్యలన్నింటినీ ఒక్కరోజులో పరిష్కరించడం సాధ్యం కాదని ఠాకూర్ తెలిపారు.