అరబ్ లో భారతీయ సంతతి కీలక పాత్ర

అరబ్ దేశాలలో భారతీయ సంతతి కీలక పాత్ర భారతదేశానికి గర్వకారణం అని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. యుఎఇ పర్యటనకు వచ్చిన ప్రధాని మంగళవారం ‘అహ్లాన్ మోదీ’ పేరిట ఏర్పాటు అయిన ఇష్టాగోష్టిలో ముచ్చటించారు. అరబీ భాషలో `అహ్లన్ మోదీ’  అంటే `హలో మోదీ’ అనే పలకరింపు. 

ఈ ఆత్మీయసమ్మేళన సభకు వేలాది మంది భారతీయ సంతతి వారు కుటుంబాలతో తరలివచ్చారు. యుఎఇ భారత్ స్నేహసంబంధాలను మరింతగా కీర్తించుకుంటూ ముందుకు సాగాల్సిన సమయం ఇదేనని, ఇక్కడి భారతీయ సంతతి దేశానికి గర్వకారణం అని ప్రధాని అభినందించారు. స్థానిక జాయెద్ స్పోర్ట్ సిటి స్టేడియంలో కార్యక్రమం జరిగింది. 

ప్రధాని రాగానే సభికులు పెద్ద ఎత్తున నమస్కార్, మోదీ మోదీ నినాదాలకు దిగారు. తన పట్ల ఇక్కడి తనవారు చూపిన భావోద్వేగం తనను కదిలించివేసిందని ప్రధాని చెప్పారు. ఇంత మంది ఇక్కడికి తరలివచ్చారు . ఆనందంగా ఉంది. ఇక్కడికి యుఎఇలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో భారతదేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. అయితే వీరందరి గుండెస్పందన అనుసంధానం ఒక్కటే అంటూ మోదీ స్పందించారు.

ఇదో చారిత్రక స్టేడియం, ఇక్కడ ఇరుదేశాల నడుమ బలోపేత బంధం గురించి ఇప్పుడు ఇంతమంది నడుమ మరోసారి వెనోళ్ల ప్రకటించుకోవల్సి ఉందని పేర్కొన్నారు. ఉభయ దేశాల జాతీయ గీతాలాపనలతో ఈ కార్యక్రమం ఆరంభమైంది.

ఇక్కడి ప్రతి వ్యక్తి గుండెస్పందన లయాన్వితంగా పలికేది ఒక్కటే భారత్ యుఎఇ స్నేహం విలసిల్లాలి అనేదే అని ప్రధాని తెలిపారు. తాను ఇక్కడి ఇంతమంది భారతీయులతో కలిసినప్పుడు తన కుటుంబ సభ్యుల వద్దకు వచ్చినంత ఆనందంగా ఉందని, 140 కోట్ల మంది భారతీయుల తరఫున సోదరసోదరీల దూతగా తాను ఇక్కడికి వచ్చినట్లు, వారి సందేశం ఇక్కడి సంతతివారికి అందిస్తున్నట్లు తెలిపారు. గడిచిన పది సంవత్సరాలలో తాను యుఎఇ పర్యటనకు రావడం ఇది ఏడోసారి అని గుర్తు చేశారు.