వాలెంటెన్స్ డే  అడ్డుకొని కల్తీ ప్రేమను ఎండగడతాం


వాలంటైన్స్ డే ను వ్యతిరేకించాలని బజరంగ్ దళ్ డిమాండ్ చేసింది. కల్తీ ప్రేమను ఒలకపోసే ప్రేమికులను అడ్డుకునే తీరుతామని హెచ్చరించింది. సోమవారం ఆబిడ్స్ జిపిఓ (జనరల్ పోస్ట్ ఆఫీస్) ఎదుట వాలెంటైన్స్ డే గ్రీటింగ్స్ ను బజరంగ్దళ్ కార్యకర్తలు దహనం చేశారు. విదేశీ సంస్కృతి నశించాలని, స్వదేశీ సంప్రదాయాన్ని పెంచి పోషించాలని, విదేశీ మాఫియాను తరిమికొట్టాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. 
 
ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ నేతలు రాహుల్, సుమంత్, ప్రవీణ్ మాట్లడారు. స్వదేశీ సంప్రదాయాన్ని పరిరక్షణ కోసం ఎంతకైనా పోరాడుతామని స్పష్టం చేశారు. ఓయో రూములతో సహా పార్కులు సినిమా టాకీస్ లో బేకరీలలో వాలెంటెన్స్ ను ప్రోత్సహిస్తూ ఈవెంట్స్ కండక్ట్ చేస్తే ఖచ్చితంగా అడ్డుకొని తీరుతామని హెచ్చరించారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే ను బహిష్కరించాలని డిమాండ్ చేశారు. 
 
తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను 14వ తేదీన ఇళ్లలో నుంచి బయటకు పంపవద్దని, వారి సెల్ ఫోన్లను అప్రమత్తతలో ఉంచాలని సూచించారు. ప్రపంచం మొత్తం భారతీయ సంప్రదాయాన్ని గౌరవిస్తోందని,  కానీ, కార్పొరేట్ దుష్టశక్తులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు ఈ దేశ సంస్కృతిపై దండయాత్ర చేస్తున్నారని వారు మండిపడ్డారు.
విదేశీ శక్తులతో కుమ్మక్కైన కార్పొరేట్ వ్యక్తులు వాలంటైన్స్ డే ను ప్రమోట్ చేస్తూ కోట్లు గడిస్తున్నారని ఆరోపించారు. బజరంగ్ దళ్ ప్రేమకు వ్యతిరేకం కాదని, కానీ ప్రేమ పేరుతో సాగుతున్న విచ్చలవిడితనాన్ని, కల్తీ ప్రేమను వ్యతిరేకిస్తుందని స్పష్టం చేశారు. సీతారాముల ప్రేమను ఆదర్శంగా తీసుకొని యువత ఆదర్శ జీవితం కొనసాగించాలని వారు సూచించారు.
ప్రేమికుల రోజును అడ్డుకుంటామని, పార్కులు.. హోటళ్లు, విహార స్థలాలు, రకరకాల ప్రదేశాల్లో సంచరించే కల్తీ ప్రేమికులకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ప్రేమ ముసుగులో సాగే తంతును అడ్డుకొని తీరుతామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ విషయంలో బజరంగ్ దళ్ విజయం సాధించిందని గుర్తుచేశారు.  ముఖ్యంగా 2019, ఫిబ్రవరి 14 న పుల్వామాలో జరిగిన ఘటన ఆధారంగా ఆ రోజు వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తామని చెప్పారు. “ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల రోజు కాదని.. అమరవీరుల సంస్కరణ దినం” అని వారు అభివర్ణించారు.