పాక్ లో అతిపెద్ద పార్టీగా ఇమ్రాన్.. సంకీర్ణంకై నవాజ్ చర్చలు

పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికల తరువాత ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఏ పార్టీ కూడా మ్యాజిక్ ఫిగర్ 134, అంటే మెజారిటీని సాధించలేకపోయింది. నాలుగు రోజులు గడుస్తున్నా ఎన్నికల సంఘం ఇంకా అధికారికంగా ఫలితాలను ప్రకటించలేదు. కాగా సంకీర్ణ ప్రభుత్వం కోసం వివిధ పార్టీల నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

నవాజ్ షరీఫ్ పార్టీ పీఎంఎల్- ఎన్ అధ్యక్షుడు షాబాజ్ షరీఫ్ ఆదివారం రాత్రి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పిపిపి) నాయకుడు ఆసిఫ్ అలీ జర్దారీ, అతని కుమారుడు బిలావల్‌ భట్టోను కలిశారు. అనంతరం పీపీపీ సోమవారం జరిగే తమ పార్టీ కేంద్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. ప్రధాని పదవి కావాలని భుట్టో డిమాండ్‌ చేస్తున్నట్టు సమాచారం.

మరోవైపు ఇమ్రాన్‌ఖాన్‌ పార్టీ పీటీఐ కూడా ప్రయత్నాలు మొదలు పెట్టింది. పీటీఐ గుర్తును కోర్టు నిషేధించడంతో ఆ పార్టీ మద్దతుదారులతంతా ఇండిపెండెంట్లుగా పోటీ చేశారు. అత్యధికంగా 101 స్థానాల్లో గెలుపొందారు. ప్రజా తీర్పును గౌరవించి తమ పార్టీనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని పీటీఐ కోరుతున్నది. 

కానీ.. ఇది సాధ్యమయ్యేలా లేదు. ఇండిపెండెంట్లుగా గెలిచన అభ్యర్థులంతా తిరిగి పీటీఐలో చేరి, అంతర్గత ఎన్నికలు నిర్వహించుకొని తిరిగి పార్టీ గుర్తు (క్రికెట్‌బ్యాట్‌)ను పొందాలి.  అయితే, ఫలితాల అనంతరం సాంకేతికంగా అతిపెద్ద పార్టీగా నిలిచి, ఆర్మీ మద్దతు ఉన్న నవాజ్‌ షరీఫ్‌ ముందంజలో ఉన్నారు.

ఈలోగా 54 సీట్లు గెలిచిన పీపీపీ ఇతర చిన్నపార్టీలతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్నది.  75 సీట్లు గెలిచిన నవాజ్‌ షరీఫ్‌ పార్టీ పీఎంఎల్‌-ఎన్‌ కూడా సర్కారు ఏర్పాటుకు మంతనాలు చేస్తున్నది. పీపీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నది. పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం 336 సీట్లు ఉన్నాయి. వీటిలో 265 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 

ఒక స్థానానికి ఫలితాలు ప్రకటించలేదు. మిగిలిన 70 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి. ఇవి నామినేటెడ్‌ సీట్టు. మహిళలను, మతపరమైన మైనారీటీలను నామినేట్‌ చేస్తారు. నవాజ్‌కు అనుకూలంగా పాక్‌ సైన్యాధ్యక్షుడు ఆసీమ్‌ మునీర్‌ కూడా రంగంలోకి దిగారు. దేశంలో ప్రజాస్వామ్య శక్తులన్నీ కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

కాగా, ఎన్నికలలో రిగ్గింగ్ జరిగిందని పిటిఐ చేస్తున్న ఆరోపణలను పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఖండించింది. కొన్ని చోట్ల అక్రమాలు జరిగిన్నట్లు తోసిపుచ్చలేమని, అయితే అటువంటి ఘటనలపై ఫిర్యాదులకు తగు వేదికలు ఉన్నాయని తెలిపింది. కొన్ని ఇబ్బందికరమైన అంశాలను ఉన్నప్పటికీ మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరిగిన్నట్లు సంతృప్తి వ్యక్తం చేసింది.

ఎన్నికల రోజున ఆపద్ధర్మ ప్రభుత్వం భద్రతా కార్యానాల దృష్ట్యా మొబైల్ సేవలను సస్పెండ్ చేయడంతో పోలింగ్ అధికారులు ఎలక్ట్రానిక్ డాటాను పంపించడంలో జాప్యం జరిగిందని తెలిపింది. కొద్దీ నియోజకవర్గాలలో మినహా ఒకటిన్నర రోజులలో చాలావరకు ఎన్నికల ఫలితాల ప్రకటన పూర్తయిన్నట్లు చెప్పింది. అయితే, పార్టీ సమాచార కార్యదర్శి రవూఫ్ హాసన్, న్యాయవాది అమైరా నైజి లతో కూడిన పిటిఐ ప్రతినిధి వర్గం దేశ అధ్యక్షుడు డా. ఆరిఫ్ అల్విని కలిసి ఎన్నికలలో జరిగిన రిగ్గింగ్ గురించి ఫిర్యాదు చేసింది.