అయోధ్య సందర్శించిన 325 మంది యుపి ఎమ్యెల్యేలు

ప్రధాన ప్రతిపక్షం సమాజ్‌వాది పార్టీకి చెందిన వారు తప్ప ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎంఎల్‌ఎలు, ఎంఎల్‌సిలతో కలిసి 325 మందికి పైగా లెజిస్లేటర్లు ఆదివారం అయోధ్యలో నూతనంగా నిర్మించిన శ్రీరామ మందిరాన్ని దర్శించుకుని పూజలు జరిపారు. పెద్ద సంఖ్యలో లెజిస్లేటర్లు రావడంతో అయోధ్య వాసుల్లో సైతం ఉత్సాహంతో ఎంఎల్‌ఎలపై పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు. 

పుణెనుంచి అయోధ్యకు చేరుకున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తన మంత్రివర్గ సహచరులతో కలిసి రామమందిరాన్ని సందర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా రామమందిరం కాంప్లెక్స్‌లోని జనమంతా ‘జై శ్రీరాం’ అంటూ నినాదాలు చేశారు. తన సహచరులతో కలిసి తాను ప్రభు శ్రీరాముడికి చెందిన భవ్య మందిరంలో పూజలు జరిపినట్లు ఎక్స్‌లో ఉంచిన పోస్టులో యోగి ఆదిత్యనాథ్ తెలిపారు.

 అసెంబ్లీ స్పీకర్ సతీశ్ మహనాతో పాటుగా కొంతమంది లెజిస్లేటర్లు ‘రఘుపతి రాఘవ రాజారాం’ భజనను పాడున్న దృశ్యాలతో పాటుగా మరి కొంతమంది లెజిస్లేటర్లు మందిరం మెట్లపై కూర్చుని గ్రూపు ఫోటోలకు పోజులిస్తున్న దృశ్యాలు 14 నిమిషాల ఆ వీడియోలో ఉన్నాయి. కొంత మంది ఎంఎల్‌ఎల సతీమణులు కూడా వారి వెంట ఉన్నారు. 

బృందంలో మొత్తం అందరూ కలిసి 400 మందికి పైగానే ఉన్నారని ఉత్తరప్రదేశ్ అసెంబ్లీకి చెందిన అదికారి ఒకరు చెప్పారు. లక్నో నుంచి పది బస్సుల్లో అయోధ్య వచ్చిన వీరంతా దర్శనం తర్వాత తిరిగి రాష్ట్ర రాజధానికి బయలుదేరినట్లు ఆ అధికారి చెప్పారు. అయితే సమయాభావం కారణంగాను, రద్దీ ఎక్కువగా ఉన్నందున వీరు అయోధ్యలోని హనుమాన్ గడీ ఆలయాన్ని దర్శించుకోలేదని రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్ ప్రసాద్ విలేఖరులకు చెప్పారు.

సమాజ్‌వాది పార్టీ యాత్రలో పాల్గొనడానికి నిరాకరించడం గురించి ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేశ్ పాఠక్‌లు మాట్లాడుతూ బహుశా రామభక్తులపై కాల్పులకు ఆదేశించిన కారణంగా వారు ఈ పర్యటనకు దూరంగా ఉండి ఉండవచ్చని, వారి మైనారిటీ బుజ్జగింపు రాజకీయాల్లో ఇది ఒక భాగమని ధ్వజమెత్తారు. 

అయితే సమాజ్‌వాది పార్టీ మిత్రపక్షమైన రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్‌ఎల్‌డి) అయోధ్య యాత్రలో పాలుపంచుకోవడం గమనార్హం. యుపి ఎంఎల్‌ఎలు మొదట ఫిబ్రవరి 1న అయోధ్య సందర్శించాలని అనుకున్నారు. అయితే పెద్ద సంఖ్యలో అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో తమ పర్యటనను వాయిదా వేసుకున్నారు.