ఇమ్రాన్‌ ఖాన్‌కు 12 కేసుల్లో బెయిల్‌

పాక్‌ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌కు రావల్పిండిలోని ఏటీసీ కోర్టు 12 కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసింది. ఆయనతో పాటు మాజీ విదేశాంగ మంత్రి షా మహమూద్‌ ఖురేషికి సైతం 13 కేసుల్లో బెయిల్‌ ఇచ్చింది.  ఇమ్రాన్ ఖాన్, షా మెహమూద్ ఖురేషీలకు బెయిల్ సీహెచ్‌ఈ, ఆర్మీ మ్యూజియం దాడులకు సంబంధించిన కేసుల్లో పూచీకత్తుపై బెయిల్‌ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
ఏటీసీ జడ్జి మాలిక్‌ ఇజాజ్‌ ఆసిఫ్‌ బెయిల్‌ను మంజూరు చేశారు. ఇమ్రాన్‌ ఖాన్‌ను కస్టడీలో ఉంచడంలో అర్థం లేదని, ఎందుకంటే మే 9న నిందితులందరికీ బెయిల్‌ మంజూరైందని పేర్కొన్నారు. ఇమ్రాన్, ఖురేషీలను ఫిబ్రవరి 6న దోషులుగా నిర్ధారించారు. ఇద్దరినీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. మే 9న ఇస్లామాబాద్ హైకోర్టు ఆవరణలో తనను అన్యాయంగా అరెస్టు చేశారని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. 
 
అవినీతి కేసులో అరెస్ట్ అయిన తర్వాత మే 9న దేశవ్యాప్తంగా చెలరేగిన అల్లర్లకు సంబంధించి ఇమ్రాన్‌పై పలు కేసులు నమోదయ్యాయి. పాకిస్థాన్ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్‌కు బెయిల్ లభించింది. గురువారం జరిగిన ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్‌ కొనసాగుతున్నది.  పాకిస్తాన్ ముస్లిం లీగ్ అతిపెద్ద పార్టీగా అవతరించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ప్రకటించడంలో జాప్యంపై విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు.
 
పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్) అధినేత నవాజ్ షరీఫ్ లండన్ ప్లాన్ ఓటింగ్ విఫలమైందని ఆయన ధ్వజమెత్తారు. తన మిత్రపక్షాలైన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ, జమియత్ ఉలేమా-ఎ-ఇస్లాం (ఎఫ్), ముత్తాహిదా క్వామీ మూవ్‌మెంట్ (పాకిస్థాన్)తో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ప్రకటించారు.