హైదరాబాద్ నుంచి విజయవాడ దగ్గర చేసే రైల్వే ట్రాక్

హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో చేరుకోవడానికి రైల్వే ట్రాక్ మొదలు కానుంది. తెలంగాణలో త్వరలో కొత్త రైల్వే లైన్ అందుబాటులోకి రానున్నందున రెండు నగరాల మధ్య ప్రయాణ సమయం తగ్గనుంది. ఖమ్మం జిల్లా మోటమర్రి, నల్గొండ జిల్లా విష్ణుపురం మధ్య 88.81 కిలోమీటర్ల రైల్వే డబ్లింగ్ లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 1,746.40 కోట్లు ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈ లైన్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్- టు విజయవాడల మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది.. నల్గొండ జిల్లా విష్ణుపురం నుంచి ఖమ్మం జిల్లా మోటుమర్రి వరకు రెండో రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గ వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. 

దీంతో హైదరాబాద్ నుంచి విజయవాడకు తక్కువ సమయంలో ప్రయాణికులను చేరవేసే రైళ్లకు మార్గం సుగమమైంది. ప్రస్తుతం విష్ణుపురం నుంచి మోటుమర్రి వరకు గూడ్స్ రైళ్లు మాత్రమే నడుస్తున్నాయి. ఈ మార్గంలో రెండో రైలు మార్గాన్ని నిర్మించి ప్యాసింజర్ రైళ్లను దారి మళ్లీంచాలని కేంద్రం నిర్ణయించింది. 

ఇప్పటి వరకు ప్రయాణికులు (కొన్ని రైళ్లు) హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి గుంటూరు వెళ్లి విజయవాడకు వెళ్లాల్సి వచ్చేది. సికింద్రాబాద్ నుంచి 313 కి.మీ దూరం ఉండగా, బీబీనగర్- టు గుంటూరు మార్గంలో సింగిల్ లైన్ ఉండడంతో ప్రయాణికులు రైలులో ప్రయాణించాలంటే దాదాపు 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది.

 ప్రస్తుతం మోటుమర్రి మార్గంలో రెండో లైన్ ఏర్పాటు చేస్తే గుంటూరు వెళ్లకుండా నేరుగా విజయవాడ చేరుకోవచ్చు. దాదాపు 50 కి.మీల దూరం తగ్గించి గంట సమయం ఆదా చేసుకునే అవకాశం ఉంది. 2011లో సిమెంట్ పరిశ్రమల వాణిజ్య అవసరాల కోసం విష్ణుపురం నుంచి మోటుమర్రి మార్గం వరకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ మార్గంలో 24 గూడ్స్ రైళ్లు తిరుగుతున్నాయి. ప్రస్తుతం సిమెంట్, ఇనుము, బియ్యం రవాణా చేస్తున్నారు.