బీజేపీ సొంతంగా 370కు పైగా సీట్లు గెల్చుకుంటుంది

వచ్చే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 400కు పైగా సీట్లు గెలుచుకొంటుందని ప్రతిపక్షాలు కూడా ఇప్పుడు చెబుతున్నాయని పేర్కొంటూ బీజేపీ సొంతంగానే 370కు పైగా సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా వ్యక్తం చేశారు.  ఈ లక్ష్య సాధనకోసం ప్రతి పోలింగ్ బూత్ లో గతంలో వేసిన ఓట్లకు మించి అదనంగా 370 ఓట్లు వేయాలని ఆయనకు ప్రజలు విజ్ఞప్తి చేశారు.
 
మధ్యప్రదేశ్‌ లోని ఝబువలో ఆదివారంనాడు రూ.7,550 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ఆదివారం శంకుస్థాన చేశారు. ”ఆహార్ అనుదాన్ యోజన” కింద సుమారు రెండు లక్షల మంది మహిళా లబ్దిదారులకు నెలవారీ ఇన్‌స్టాల్‌మెంట్లను అందజేశారు. ఈ పథకం కింద మహిళలకు, ముఖ్యంగా వెనుకబడిన తెగల మహిళలకు పౌష్టికాహారం కోసం నెలకు రూ.1,500 చొప్పున అందిస్తున్నారు. 
 
స్వామిత్వ పథకం కింద 1.75 లక్షల ‘అధికార్ అభిలేఖ్’  (భూమి హక్కుల రికార్డు)ని కూడా ప్రధాని పంపిణీ చేశారు. ఈ పథకం ప్రజలకు వారి భూమిపై అన్ని అధికారాలు కల్పించనుంది. గిరిజన యువకుల కోసం రూ.170 కోట్లతో ఏర్పాటు చేస్తున్న తాంత్యా మాలా భిల్ యూనివర్శిటికీ కూడా ప్రధాని శంకుస్థాపన చేశారు.
 
ఈ సందర్భంగా ఏర్పాటు చేసి జన్ జాతీయ మహాసభను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ, ప్రజాసేవకు తాము కట్టుబడి ఉన్నామని, డబుల్ ఇంజన్ ప్రభుత్వంతో అభివృద్ధి పనులు డబుల్ స్పీడ్‌తో ముందుకు దూసుకుపోతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతి ఇందుకు ఉదాహరణ అని తెలిపారు. 
 
మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాని వస్తుండటంపై చాలా చర్చ జరుగుతోందని, లోక్‌సభ ఎన్నికల పోరాటాన్ని ఝబువా నుంచి ప్రధాని ప్రారంభించనున్నారని కొందరు చెబుతున్నారని, అయితే తాను ఎన్నికల ప్రచారం కోసం ఇక్కడకు రాలేదని, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చానని మోదీ స్పష్టం చేశారు. గిరిజన కమ్యూనిటీ తమకు ఓటు బ్యాంకు కాదని, దేశానికి గర్వకారణమని ప్రశంసించారు. 
 
గత పదేళ్లలో తమ ప్రభుత్వం సాధించిన అభివృద్ధిని కూడా ఈ సందర్భంగా మోదీ వివరించారు. దీనికి ముందు, ఝబువా ప్రధాని రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్డుకి ఇరువైపులా ప్రజలు ప్రధానిపై పూలు జల్లుతా సాదరస్వాగతం పలికారు. ప్రధాని వెంట మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యూదవ్ కూడా రోడ్‌షోలో పాల్గొన్నారు.