రైతుల ‘చలో ఢిల్లీ’ పిలుపుతో సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం

* రైతులతో ముగ్గురు కేంద్ర మంత్రులు చండీఘర్ లో సోమవారం సాయంత్రం చర్చలు
రైతులు మరోసారి చలో ఢిల్లీ ఆందోళనకు పిలుపు ఇవ్వడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు ఈనెల 13న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టాలని 200 రైతు సంఘాలు నిర్ణయించాయి. దాంతో  దేశ రాజధానిలోకి రైతులు అడుగుపెట్టకుండా ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది.
 
 హర్యానా, ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఢిల్లీలో పోలీసులు హై అలర్ట్‌ ప్రకటించారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రధాన రోడ్లపైకి రావద్దని హర్యానా పోలీసులు హెచ్చరించారు. అంబాల, సోనిపట్‌, పంచకుల్‌లో సెక్షన్‌ 144 విధించారు. 50 కంపెనీల కేంద్ర బలగాలను సిద్ధంగా ఉంచారు. అప్రమత్తమైన హర్యానా  ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో మొబైల్‌ ఇంటర్నెట్ సేవలను బంద్‌  చేసింది. బల్క్‌ ఎస్‌ఎంఎస్‌లపై ఆంక్షలు విధించింది.
అంబాలా, కురుక్షేత్ర, కైథాల్‌, జింద్‌, హిసార్‌, ఫతేబాద్‌, సిర్సా జిల్లాల్లో ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ఈ నెల 13వ తేదీ రాత్రి 11.59 గంటల వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది.  దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల వద్ద భారీగా భద్రతా దళాలను మోహరించారు. పంజాబ్‌, హర్యానా నుంచి రైతులు నగరంలోకి ప్రవేశించకుండా ప్రధాన మార్గాల్లో క్రేన్‌లు, కంటెయినర్‌లను సిద్ధం చేశారు. ఒకవేళ రైతులు నగరంలోకి రావాలని ప్రయత్నిస్తే వాటితో సరిహద్దులను మూసివేస్తామని తెలిపారు.

ఇలా ఉండగా, రైతుల డిమాండ్లపై రైతు ప్రతినిధులతో ముగ్గురు కేంద్ర మంత్రులు సోమవారం సాయంత్రం 5 గంటలకు చండీఘర్ లో చర్చలు జరుపనున్నారు. కేంద్ర మంత్రులు అర్జున్ ముండా, పీయూష్ గోయల్, నిత్యానంద రాయ్ ఈ చర్చలలో పాల్గొంటున్నట్టు పంజాబ్ కిసాన్ మంజూరు సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శి సర్వాన్ సింగ్ పందెర్ తెలిపారు. 

అంబాలా, పాటియాలా పోలీసులు తమ తమ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను దారి మళ్లించారు. అంబాలాలోని శంభూ టోల్‌ప్లాజా సమీపంలో వాహనాలను ఆపేందుకు వీలుగా సిమెంట్‌ బారికేడ్లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై ఉన్న పాటియాలా- శంభూ సరిహద్దు వద్ద వాహనాల రాకపోకలను ఇప్పటికే నిలిపివేశారు. సరిహద్దుల వద్ద మోహరింపులను పెంచారు. ప్రజలు అత్యవసరమైతే తప్ప రాష్ట్రంలోని ప్రధాన రోడ్లపై ప్రయాణించవద్దని హర్యానా పోలీసులు సూచించారు.
 
పంటలకు కనీస మద్దతు ధర సహా పలు ఇతర సమస్యలను పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చా తదితర సంఘాలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి.  పంటలకు కనీస మద్దతు ధరపై రూపొందించిన చట్టాన్ని నిరసిస్తూ రైతులు 2020లో పెద్దయెత్తున ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. 
 
అప్పట్లో తమపై పెట్టిన కేసులను కొట్టివేయాలని వారు పట్టుపడుతున్నారు. అలాగే కనీస మద్దతు ధరకు చట్టపరమైన హామీ ఇవ్వాలని, స్వామినాధన్‌ కమిషన్‌ సిఫార్సులు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.  రైతు నాయకుడు జగ్‌జిత్‌ సింగ్‌ దాలెవాల్‌ మాట్లాడుతూ  ప్రభుత్వం ఓ వైపు చర్చలకు పిలుస్తూనే హర్యానాలో తమని భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. ”సరిహద్దులు మూసేశారు. 144వ సెక్షన్‌ విధించారు. ఇంటర్నెట్‌ సేవలు నిలిపివేశారు. అసలు ప్రభుత్వానికి ఈ అధికారం ఉందా? ఇలాంటి పరిస్థితుల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరగవు. ప్రభుత్వం ఈ అంశంపై దృష్టి పెట్టాలి” అని స్పష్టం చేశారు.