ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ1 నిందితుడిగా చంద్రబాబు

త్వరలో జరిగే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో భారీ ఆధిక్యతతో టిడిపి – జనసేనలు గెలుపొందబోతున్నట్లు ఓ ప్రముఖ జాతీయ సర్వే వెల్లడించిన రోజుననే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ గట్టి షాక్ ఇచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబునాయుడిని ప్రథమ నిందితుడిగా చేరుస్తూ ఏసీబీ కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసింది. 
 
రెండో ముద్దాయిగా మాజీ మంత్రి నారాయణతోపాటు నారా లోకేశ్, లింగమనేని రాజశేఖర్, లింగమనేని రమేష్ లను కూడా నిందితులుగా చేర్చింది. ఇన్నర్ రింగ్ రోడ్డుపై సింగపూర్ ప్రభుత్వంతో గత చంద్రబాబు ప్రభుత్వం తప్పుడు ఒప్పందం కుదుర్చుకున్నదని సీఐడీ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది.

`గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒప్పందం’ అనే పేరిట అందరినీ చంద్రబాబు ప్రభుత్వం తప్పుదోవ పట్టించిందని ఏపీ సీఐడీ తన చార్జిషీట్‌లో వెల్లడించింది. ప్రభుత్వం 2 ప్రభుత్వం ఒప్పందమేమీ జరుగలేదని నిర్ధారించింది. అసలు సింగపూర్ ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందానికి కేంద్ర ప్రభుత్వ అనుమతి లభించలేదని స్పష్టం చేసింది. 

మాస్టర్ ప్లాన్ పేరిట చట్ట విరుద్ధంగా సుర్బానా జురాంగ్ సంస్థకు డబ్బు చెల్లించారని నిర్ధారణకు వచ్చింది. నిందితులకు మేలు చేసేలా ఇన్నర్ రింగ్ రోడ్డు, సీడ్ క్యాపిటల్ మాస్టర్ ప్లాన్లు రూపొందించారని తన చార్జిషీట్ లో వివరించింది. లింగమనేని బ్రదర్స్ భూములు, హెరిటేజ్ భూములు, నారాయణ భూములకు అనుగుణంగా ఇన్నర్ రింగ్ రోడ్డు మాస్టర్ ప్లాన్ మార్చారని తెలిపింది.

ఇన్నర్ రింగ్ రోడ్డు పరిధిలో మాజీ మంత్రి నారాయణ తన బంధువుల పేరిట 58 ఎకరాలు కొనుగోలు చేశారు. లింగమనేని 340 ఎకరాల ల్యాండ్ బ్యాంకుకు మేలు చేసే విధంగా ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్‌లో మార్పులు చేర్పులు చేశారు. లింగమనేని తన ఇంటిని చంద్రబాబుకు ఇచ్చారని సీఐడీ వివరించింది. 

లింగమనేని ల్యాండ్ బ్యాంకు పక్కనే హెరిటేజ్ ఫుడ్స్ 14 ఎకరాల భూమి కొనుగోలు చేసిందని తెలిపింది. ఈ భూముల విలువ పెరిగేలా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్చేశారని నిర్ధారించినట్లు సీఐడీ తెలిపింది.