ఇప్పటికే ఐదుసార్లు అండర్ 19 ప్రపంచ కప్ గెలిచిన భారత్ ఇప్పుడు ఆరో టైటిల్ పై కన్నేసింది. మంగళవారం ఆతిథ్య సౌతాఫ్రికా అండర్ 19 టీమ్ తో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో ఇండియా అండర్ 19 రెండు వికెట్లతో విజయం సాధించి ఫైనల్ చేరింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన యంగ్‌ఇండియా ఈ టోర్నీలో ఓటమి ఎరగకుండా తుదిపోరుకు చేరింది.
మంగళవారం ఉత్కంఠభరితంగా సాగిన సెమీఫైనల్లో యంగ్ ఇండియా 2 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తుచేసింది. ఈ మెగాటోర్నీలో భారత జట్టు తుదిపోరుకు అర్హత సాధించడం ఇది తొమ్మిదోసారి కాగ, వరుసగా ఐదోసారి. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 244 పరుగులు చేసింది.
ఓపెనర్ ప్రిటోరియస్ (76; 6 ఫోర్లు, 3 సిక్సర్లు), రిచర్డ్ (64; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో రాణించారు. భారత బౌలర్లలో రాజ్ లింబాని 3, ముషీర్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో యంగ్‌ఇండియా 48.5 ఓవర్లలో 8 వికెట్లు క్పోలోయి 248 పరుగులు చేసింది. ఉదయ్ సహ్రాన్ (81; 6 ఫోర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా, సచిన్ దాస్ (95 బంతుల్లో 96; 11 ఫోర్లు, ఒక సిక్సర్) తృటిలో శతకం చేజార్చుకున్నాడు.
ఒక దశలో 32 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి ఇక ఇంటిబాట పట్టడం ఖాయమే అనుకుంటున్న దశలో ఈ ఇద్దరు గొప్ప సంయమనం చూపారు. క్రీజులో నిలదొక్కుకునేందుకు సమయం తీసుకున్న ఈ జోడీ ఆ తర్వాత సఫారీ బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. ఉదయ్ క్రీజులో పాతుకుపోతే సచిన్ ఎడాపెడా బౌండ్రీలతో స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 171 పరుగులు జోడించడంతో భారత్ మంచి స్థితికి చేరింది.
చివర్లో కాస్త ఉత్కంఠ ఎదురైనా రాజ్ లింబాని (4 బంతుల్లో 13 నాటౌట్; ఒక ఫోర్, ఒక సిక్సర్) భారీ షాట్‌లతో మ్యాచ్‌ను ముగించాడు. సఫారీ బౌలర్లలో క్వెనా, ట్రిస్టన్ చెరో మూడు వికెట్లు పడగొట్టారు. గురువారం ఆస్ట్రేలియా, పాకిస్థాన్ మధ్య రెండో సెమీస్ జరగనుంది.
దక్షిణాఫ్రికా: 50 ఓవర్లలో 244/7 (ప్రిటోరియస్ 76, రిచర్డ్ 64; రాజ్ 3/60, ముషీర్ 2/43),
భారత్: 48.5 ఓవర్లలో 248/8 (సచిన్ 96, ఉదయ్ 81; క్వెనా 3/32, ట్రిస్టన్ 3/37).
భారత్: 48.5 ఓవర్లలో 248/8 (సచిన్ 96, ఉదయ్ 81; క్వెనా 3/32, ట్రిస్టన్ 3/37).
More Stories
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష
ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఉపసంహరణ
అమెరికాకు స్వర్ణయుగం ప్రారంభం